Kotak Institutional Equities
-
ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తున్నారు!
ఇటీవల సెకండరీ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరిగెడుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఈ నేపథ్యంలో పలు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు కొంతమేర సొంత వాటాలను విక్రయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..ముంబై: రోజుకో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకుతూ దౌడు తీస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. దీంతో కొన్ని కంపెనీల ప్రమోటర్లు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమ వాటాలో కొంతమేర విక్రయిస్తున్నారు. తద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు. వీటిని రుణ చెల్లింపులు, విస్తరణ ప్రణాళికలు, పబ్లిక్కు కనీస వాటా తదితరాలకు వినియోగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం 2024 తొలి ఆరు నెలల్లోనే ఎన్ఎస్ఈ–500లోని కొన్ని కంపెనీల ప్రమోటర్లు 10.5 బిలియన్ డాలర్ల(రూ. 87,000 కోట్లకుపైగా) విలువైన ఈక్విటీలను విక్రయించారు. మరొక విశ్లేషణ ప్రకారం గత రెండు నెలల్లోనే సుమారు 200 లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు రూ. 33,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించడం తాజా ట్రెండ్‌కు అద్దం పడుతోంది. వెరసి దేశీ ఈక్విటీల విలువలు అత్యంత ప్రీమియంస్థాయికి చేరాయన్న సంకేతాలు వెలువడుతున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు తమతమ బిజినెస్‌లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేíÙంచారు. కరోనా ఎఫెక్ట్...ప్రస్తుత మార్కెట్లలో పలు కంపెనీల షేర్లు గరిష్ట విలువలకు చేరడంతో బ్లాక్ డీల్స్ లేదా బల్క్ డీల్స్ ద్వారా ప్రమోటర్లు కొంతమేర వాటాలను అమ్మివేస్తున్నారు. వీరికితోడు ఇటీవల పీఈ దిగ్గజాలు, ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుత ట్రెండ్ కారణంగా 2023 జనవరి–డిసెంబర్లో నమోదైన 12.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,04,000 కోట్లు) విక్రయ రికార్డ్ 2024 కేలండర్ ఏడాదిలో తుడిచిపెట్టుకుపోయే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2023లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు వాటాలు విక్రయించిన విషయం విదితమే. 2024లో ఇప్పటివరకూ దేశ, విదేశీ ప్రమోటర్లు మొత్తంగా రూ. 87,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. కోవిడ్–19 నేపథ్యంలో 2020 జనవరి–డిసెంబర్‌లోనూ రికార్డు నెలకొల్పుతూ రూ. 78,500 కోట్ల విలువైన షేర్లను వివిధ కంపెనీల ప్రమోటర్లు అమ్మివేశారు.జూన్‌లో పలువురు ప్రమోటర్లు బ్లాక్ డీల్స్ ద్వారా భారీగా వాటాలను విక్రయించారు. రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలతో ఇండస్ టవర్స్‌లో యూకే దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ 18 % వాటాను విక్రయించింది. ఇక ఎంఫసిస్‌లో 15% వాటాను పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ 80 కోట్ల డాలర్లకు అమ్మింది. దేశీ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌లో ప్రమోటర్ వేదాంతా రిసోర్సెస్ 2.63% వాటా విక్రయం ద్వారా రూ. 4,184 కోట్లు సమీకరించింది. ఇక జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్లో వాబ్కో ఏషియా 30 కోట్ల డాలర్ల విలువైన వాటాను విక్రయించింది.విక్రయ తీరు(రూ. కోట్లలో)కంపెనీ పేరు షేర్ల విలువ ఇండస్ టవర్స్ 15,300 ఎంఫసిస్ 6,680 వేదాంతా 4,184 ఇంటర్‌గ్లోబ్ 3,300 జెడ్ఎఫ్ సీవీ 2,194 గ్లాండ్ ఫార్మా 1,754 -
ఐటీ కంపెనీల పనితీరు భేష్!
ముంబై: ఎగుమతుల ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట వృద్ధిని సాధించనున్నాయి. సీజనల్‌గా చూస్తే నిజానికి సాఫ్ట్వేర్ పరిశ్రమలో అక్టోబర్–డిసెంబర్(క్యూ3) బలహీన కాలంగా విశ్లేషకులు పేర్కొంటుంటారు. అయితే క్యూ3లో త్రైమాసికవారీగా ఆదాయాలు సగటున 2.6–6 శాతం మధ్య పుంజుకునే వీలున్నట్లు కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక అంచనా వేసింది. ట్రాన్స్‌ఫార్మేషన్‌పై వ్యయాలు పెరగడం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొంది. ఈ వారాంతం లేదా వచ్చే వారం నుంచీ ఐటీ దిగ్గజాల క్యూ3 ఫలితాల విడుదల ప్రారంభంకానుంది. బ్లూచిప్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ తొలుత ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. వార్షిక ప్రాతిపదికన క్యూ3 ఆదాయ అంచనాలను కొటక్ నివేదిక వెల్లడించనప్పటికీ షేరువారీ ఆర్జన(ఈపీఎస్)పై మిశ్రమంగా స్పందించింది. కొన్ని కంపెనీల ఈపీఎస్‌లో 15 శాతం క్షీణతకు అవకాశముంటే.. మరికొన్ని దిగ్గజాలు 11 శాతంవరకూ వృద్ధిని అందుకోవచ్చని అభిప్రాయపడింది. సాఫ్ట్వేర్ రంగం ఎగుమతుల ఆధారితంకావడంతో డాలరు బలపడటం లాభించనున్నట్లు పేర్కొంది. ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు పుంజుకోవడంతో 20–90 బేసిస్ పాయింట్లమేర మార్జిన్లు మెరుగుపడే వీలున్నట్లు తెలియజేసింది. వృద్ధి బాటలో... కొటక్ నివేదిక ప్రకారం లార్జ్ క్యాప్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా.. మిడ్ క్యాప్స్‌లో ఎల్టీ ఇన్ఫోటెక్ ముందుండే అవకాశముంది. ఆయా కంపెనీలు ఇటీవల సిబ్బందిని పెంచుకోవడం, ఫ్రెషర్లకు అవకాశాలు ఇవ్వడం వంటి అంశాలను ఇందుకు ప్రస్తావించింది. ఉద్యోగ వలసలు(ఎట్రిషన్) వేధిస్తున్నప్పటికీ డీల్స్ కుదుర్చుకోవడంలో సఫలంకావడం సానుకూలతలుగా పేర్కొంది. స్థిరకరెన్సీ ప్రాతిపదికన విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ 4.5 శాతం పురోగతి సాధించనుండగా.. ఇన్ఫోసిస్ 3.7 శాతం, టీసీఎస్ 2.6 శాతం చొప్పున వృద్ధి చూపవచ్చని బ్రోకింగ్ సంస్థ కొటక్ అంచనా వేసింది. మధ్యస్థాయి కంపెనీలు 5–6 శాతం పుంజుకోవచ్చని, వార్షికంగా చూస్తే మరింత అధికంగా సగటున 20–34 శాతం మధ్య ఆదాయాల్లో వృద్ధి నమోదుకావచ్చని విశ్లేషించింది. అయితే ఈపీఎస్ వృద్ధిలో విప్రో యథాతథంగా, ఇన్ఫోసిస్ 6 శాతం, టీసీఎస్, టెక్ మహీంద్రా 13–14 శాతం చొప్పున సాధించే వీలుండగా.. హెచ్‌సీఎల్ క్షీణతను చవిచూడవచ్చని పేర్కొంది. ఇబిట్ నీరసం... క్యూ3లో వార్షికంగా సగటున అన్ని కంపెనీల నిర్వహణ (ఇబిట్) మార్జిన్లు మందగించవచ్చని కొటక్ నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం ఇందుకు ఎట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు, సీనియర్ల నియామకాలు, యుటిలైజేషన్ తగ్గడం, వ్యయాలు పెరగడం వంటివి ప్రభావం చూపనున్నాయి. కాగా.. ఇన్ఫోసిస్ గైడెన్స్‌ను 1 శాతంమేర పెంచి 17–17.5 శాతంగా ప్రకటించవచ్చు. తొలుత 12–14 శాతం వృద్ధి అంచనాలతో ఏడాదిని ప్రారంభించడం గమనార్హం. ఇక హెచ్‌సీఎల్ రెండంకెల ఆదాయ వృద్ధిని అంచనా వేసింది. 12 శాతం పురోగతిని అందుకునే వీలుంది. -
చమురు ధరల పతనం భారత్‌కు వరం
న్యూఢిల్లీ: చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు ఎన్నో విధాలుగా కలిసొస్తుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అభిప్రాయం వ్యక్తం చేశాయి. దేశ చమురు అవసరాల్లో 84 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. చమురు దిగుమతుల బిల్లు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు (క్యాడ్), ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తగ్గుముఖం పడతాయని, దీంతో అధిక జీడీపీ వృద్ధి రేటు సాధ్యపడుతుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. ధరల స్థిరత్వానికి వీలుగా ఉత్పత్తికి కోత విధించే విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తడంతో.. సౌదీ అరేబియా ఏకపక్షంగా ధరలను తగ్గించడం ఫలితంగా బ్యారెల్ చమురు 30 డాలర్లకు పడిపోయిన విషయం గమనార్హం. ఇక అదే సమయంలో ఓపెక్ దేశాలకు, రష్యా తదితర నాన్ ఓపెక్ దేశాల మధ్య ఉత్పత్తి కోతకు సంబంధించిన అంగీకార గడువు మార్చిలో గడువు తీరిపోనుంది. దీంతో రోజువారీ ఉత్పత్తి 10 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుందని అనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రనపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ తగ్గుతుండడం కూడా ధరలపై ప్రభావం చూపిస్తోంది. ‘‘చమురు ధర బ్యారెల్‌పై ప్రతీ 10 డాలర్ల పతనంతో 15 బిలియన్ డాలర్లు ఆదా అవుతుంది. ఇది జీడీపీలో క్యాడ్ 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గేలా చేస్తుంది’’ అని కోటక్ తన నివేదికలో పేర్కొంది. దేశం నుంచి జరిగే ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు. ఈ రంగాలకు మేలు చమురు ధరలు తగ్గడం ఆటోమొబైల్స్, విమానయానం, రంగుల పరిశ్రమ, కన్జ్యూమర్ కంపెనీలు, సిటీ గ్యాస్ పంపిణీ సంస్థలు, చమురు విక్రయ సంస్థలకు కలసిసొస్తుందని కోటక్ తెలిపింది. కానీ, చమురు బ్యారెల్‌కు 35 డాలర్లకు దిగువన ఉంటే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు నికర నష్టాలు ఎదురవుతాయని అంచనా వేసింది. క్యాడ్ 0.7 శాతానికి తగ్గుతుంది చమురు ధరల పతనంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు 25 బేసిస్ పాయింట్లు తగ్గి జీడీపీలో 0.7 శాతానికి పరిమితం అవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. కరోనా వైరస్ జనవరిలో వెలుగు చూసిన తర్వాత నుంచి చమురు ధరలు 45 శాతం వరకు క్షీణించాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.20 శాతం తగ్గించి 5.4 శాతానికి సవరించింది. ప్రపంచ వృద్ధి రేటు అంచనాలకు 0.60 శాతం కోత పెట్టి తాజాగా 2.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఒకవేళ అంతర్జాతీయ మాంద్యం ఏర్పడితే ప్రపంచ వృద్ధి రేటు 1.4 శాతానికి, భారత జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. -
4జీ మొబైల్స్ హవా
న్యూఢిల్లీ: భారతలో 4 జీ మొబైల్ ఫోన్ల జోరు పెరుగుతోంది. మార్కెట్లో తక్కువ ధరకు లభించడమే ఇందుకు కారణమని, దాదాపు 15 రకాల ఫోన్లు రూ. 5000, అంతకంటే తక్కువకే దొరుకుతున్నాయని కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక పేర్కొంది. 5 ఇంచ్ స్క్రీన్ సైజు, 1.1 జీహెచ్‌జెడ్ క్వాడ్-కోర్ ప్రొసేసర్ , 8 జీబీ ఇంటర్నల్ మొమరీ, 5 ఎంపీ కెమెరా, 2,300 ఎంఎహెచ్ బ్యాటరీ ఇలా పలు ఫీచర్స్ గల 4 జీ మొబైల్స్ రూ. 4000 లకే లభ్యమవుతున్నాయని నివేదిక తెలిపింది.