న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎంపిక కావడంపై ఆయన మామ,ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సంతోషం ప్రకటించారు. రిషి విజయంపై సోషల్‌మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
రిషికి అభినందనలు. అతణ్ని చూసి గర్వంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ నారాణ మూర్తి ఆనందం వ్యక్తం చేశారు. యూకే అభివృద్ధి, బ్రిటన్ ప్రజల కోసం రిషి పనిచేస్తారనే విశ్వాసం తనకుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
యూకేకి తొలి శ్వేత జాతీయేతర ప్రధానిగా 42 ఏళ్ల రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధానిగా, ఈ శతాబ్దంలో యూకే ప్రధాని పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడుగా కూడా రిషి నిలిచారు. రిషి సునాక్ తల్లి ఫార్మసిస్ట్, తండ్రి డాక్టర్. సునాక్ ఇంగ్లాండ్‌లోని పాపులర్ యూనివర్శిటీలు వించెస్టర్, ఆక్స్‌ఫర్డ్‌లో విద్య నభ్యసించారు. గోల్డ్‌మన్ సాక్స్ కంపెనీలో మూడు సంవత్సరాలు పనిచేశారు. ఆ తరువాత కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ నుండి ఎంబీఏ పట్టా పొందారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత ప్రధాని రేసులో గట్టిపోటీ ఇచ్చినా విజయం సాధించలేకపోయారు. అయితే అనూహ్యంగా ప్రధాని రాజీనామాతో నెలకొన్ని పరిణామాల అనంతరం అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్ వైదొలగడంతో రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాగా 2009లో ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె అక్షితామూర్తిని రిషి సునాక్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment