దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 3.2 శాతం వృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదిక ప్రకారం 3.9 కోట్ల స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్ (రిటైలర్లకు తయారీ సంస్థలు సరఫరా చేసే ఫోన్ల సంఖ్య) నమోదైంది. ఇందులో 16.5 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీ వివో అగ్రస్థానంలో ఉండగా, 13.5 శాతం వాటాతో అదే దేశానికి చెందిన షావోమి రెండో స్థానంలో నిలిచింది. కొరియన్ సంస్థ శాంసంగ్ అమ్మకాలు 15.4 శాతం క్షీణించడంతో 12.9 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు, మార్కెట్ వాటాపరంగా యాపిల్ 6.7 శాతం వాటాతో ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సూపర్ ప్రీమియం సెగ్మెంట్‌లో (రూ.67,000 పైగా రేటు ఉండే ఫోన్లు) మాత్రం 83 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
ఫ్లాగ్‌షిప్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోతో పాటు వై సిరీస్, మిడ్–ప్రీమియం వి సిరీస్‌ల్లో వివిధ ధరల శ్రేణిలో ఫోన్లను ఆవిష్కరించిన వివో వరుసగా రెండో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో నిలిచింది.
ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్ (రూ.16,000 నుంచి రూ.33,500 వరకు ధర ఉండేవి) వాటా 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. ఈ సెగ్మెంట్ మెరుగైన వృద్ధి కనపర్చగలదని అంచనాలు ఉన్నాయి. చౌక 5జీ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరిస్తున్నప్పటికీ 100 డాలర్ల లోపు (సుమారు రూ.8,400) ధర ఉండే ఎంట్రీ లెవెల్ ఫోన్ల అమ్మకాలకు ఈ ఏడాది సవాళ్లు ఎదురుకావచ్చు. జెన్‌ఏఐ స్మార్ట్‌ఫోన్లకు ప్రచారం మరింత పెరగవచ్చు.
క్యూ2లో 2.7 కోట్ల 5జీ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్ నమోదైంది. 5జీ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్ వార్షికంగా 49 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. ఇందులోనూ రూ.8,000 నుంచి రూ.16,700 వరకు ధర ఉండే మాస్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల షిప్‌మెంట్ 2.5 రెట్లు పెరిగింది.
ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!
ప్రీమియం సెగ్మెంట్‌లో (రూ.50,000 నుంచి రూ.67,000 వరకు ధర శ్రేణి) యాపిల్ మార్కెట్ వాటా 61 శాతానికి, శాంసంగ్ వాటా 24 శాతానికి పెరిగింది.
ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు 6.9 కోట్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment