కెనడాలో త్వరలో రెయిన్‌ట్యాక్స్ విధానం అమలు
సవాలుగా మారిన మురుగునీటి నిర్వహణ
స్మార్ట్ వాటర్ ఛార్జ్‌తో పరిష్కారం
బ్రిటిష్ పాలనలో చాలా రకాల పన్నులు వేసేవారు. ఇప్పటికీ వారి పాలనలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను, ఇంటిపన్ను, టోల్ వంటి అనేక ట్యాక్స్‌లు సామాన్యుల భారంగా మారుతున్నాయి. మనిషి తయారుచేసిన ఉత్పత్తులు, వాటికి అందించే సేవలపై ట్యాక్స్‌లుండడం సహజం. అయితే విచిత్రంగా ప్రకృతి ప్రసాదించే వర్షానికి సైతం పన్ను చెల్లించే పరిస్థితి ఏర్పడింది. బహుశా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ఈ విధానం లేదు. మొట్టమొదటిసారిగా కెనడాలో వచ్చే నెల నుంచి రెయిన్ ట్యాక్స్ అమలు కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అసలు కెనడా ప్రభుత్వం ప్రకృతి సహజంగా ప్రసాదించే వర్షంపై ప్రజలపై ఎందుకు ట్యాక్స్ విధిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
మీడియా కథనాల ప్రకారం..టొరంటో నగరంతోపాటు దాదాపు కెనడా మొత్తం తుపాను నీటి నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. కెనడాలో మార్చి నుంచి మే నెల వరకు వర్షంతో పాటు మంచు కురుస్తుంది. భూఉపరితలం, చెట్లు, మొక్కల ద్వారా గ్రహించబడని వర్షపునీరు బయట రోడ్లపై ప్రవహిస్తుంటుంది. అయితే ఆదేశంలో నేల కనిపించకుండా ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు.. అలా దాదాపు అంతా కాంక్రీటుమయం కావడంతో నీటి నిర్వహణ సవాలుగా మారుతోంది. కెనడాలో తుపాన్లు ఎక్కువగా వస్తూంటాయి. అది సమస్యను మరింత పెంచుతోంది. దాంతో ప్రజల రోజువారీ కార్యకలాపాలు చాలా దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితుల్లో స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.
నీటి వినియోగదారులు, ఆసక్తిగల పార్టీల సహకారం, ఎన్‌జీఓలతో తుపాను నీటి నిర్వహణను పరిష్కరించడానికి ప్రభుత్వం ‘స్మార్ట్ వాటర్ ఛార్జ్, వాటర్ సర్వీస్ ఛార్జ్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. అందుకు అవసరమయ్యే ఆర్థిక భారాన్ని ప్రజలే భరించాలనే ఉద్దేశంతో రెయిన్‌ట్యాక్స్‌ను విధించనున్నట్లు తెలిసింది.
కెనడాలో అధికభాగం రాతినేలలే. దాంతో వర్షపునీరు నేలలో ఇంకేందుకు చాలా సమయం పడుతుంది. చిన్నపాటి వర్షం కురిసినా డ్రెయిన్ వాటర్‌తో నాలాలు పొంగిపోర్లుతుంటాయి. ఈ సమస్యను ‘రన్‌ఆఫ్’ అంటారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ స్మార్ట్ వాటర్ ఛార్జ్‌ను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా సేకరించిన అదనపు నీటిని బయటకు తీస్తారు. దానికి అయ్యే ఖర్చులను రెయిన్‌ట్యాక్స్ ద్వారా భర్తీ చేస్తారు.
వర్షపు పన్ను ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఎక్కువ భవనాలు ఉన్న చోట ఎక్కువ రన్‌ఆఫ్ ఉంటుంది. అందువల్ల అక్కడ వర్షం పన్ను కూడా ఎక్కువ విధిస్తారు. ఈ పన్ను కేటగిరీలో ఇళ్లు, పార్కింగ్ స్థలాలు, కాంక్రీటుతో చేసిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. కెనడాలో విధించే వ్యక్తిగత పన్నులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను విధించే దేశాల విభాగంలో కెనడా ఉంటుంది. తాజాగా వర్షపు పన్ను ప్రజలపై మరింత భారంమోపేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే అద్దె ఇళ్లలో నివసించే వారిపై ఈ పన్ను విధిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు చేదువార్త.. త్వరలో రీఛార్జ్ ప్లాన్ల పెంపు..? ఎంతంటే..
కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలో భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. టొరంటో ప్రజలు ఇప్పటికే నీటిపై పన్ను చెల్లిస్తున్నారు. ఇందులో తుపాను నీటి నిర్వహణ ఖర్చు కూడా ఉందని కొందరు చెబుతున్నారు. నీటి పన్నుతోపాటు ప్రత్యేకంగా రెయిన్‌ట్యాక్స్ విధించడంపట్ల ప్రజల నుంచి విమర్శలు వస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment