LPG price by Rs 400/cylinder బీజేపీ సర్కార్ హయాంలో ఇటీవలి కాలంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగి సామాన్యుడికి పెనుభారంగా మారడంతో బీజేపీ సర్కార్ తీవ్ర విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల ధరను రూ. 200 తగ్గించింది. అలాగే పిఎం ఉజ్వల పథకం లబ్ధిదారులకు అదనంగా రూ.200 లభించనుంది. దీంతో PMUY ఖాతాదారులకందే సబ్సిడీ రూ.400 అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ మహిళలకు అందించిన రక్షాబంధన కానుక అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు
ఎల్‌పిజి సీలిండర్ ధర తగ్గింపు రాబోయే ఎన్నికలకు సంబంధించినదేనా అన్నదానిపై స్పందించిన ఠాకూర్ అలా అనుకుంటే ముందే తగ్గించే వాళ్లం అంటూ ఈ వాదనను తోసిపుచ్చారు. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సౌదీ CP (కాంట్రాక్ట్ ధరలు) ధరలను పరిశీలిస్తే, ఏప్రిల్ 2022 నుండి 303 శాతం పెరిగింది. కానీ తాము మాత్రం 63 శాతం మాత్రమే పెంచి కొంత ఉపశమనం కలిగించామంటూ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపు నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కోట్లాది వినియోగదారుల ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే ఉజ్వల పథకం కింద 7.5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్‌లకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.6,100 కోట్లు కేటాయించామని, 2023-24 సంవత్సరానికి ఆర్థిక ప్రభావం రూ. 7,680 కోట్లుగా అంచనా వేశామన్నారు. కాగా ప్రస్తుతం న్యూఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ రూ. 1,103గా ఉంది. చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సిలిండర్‌కు రూ. 50 పెరిగిన సంగతి తెలిసిందే.
"Government has decided Rs 200 reduction in the price of domestic LPG cylinders for all LPG consumers"
— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 29, 2023
-Union Minister @ianuragthakur#CabinetDecisions #LPGcylinder pic.twitter.com/sfwTyxUlsN
ఇప్పటివరకు దేశంలోని ప్రధాన నగరాల్లో 14.2 కేజీల వంట గ్యాస్ ధరలు
హైదరాబాద్ | రూ. 1,155.00 |
ముంబై | రూ. 1,102.50 |
గుర్గావ్ | రూ. 1,111.50 |
బెంగళూరు | రూ. 1,105.50 |
చండీగడ్ | రూ. 1,112.50 |
జైపూర్ | రూ. 1,106.50 |
పాట్నా | రూ. 1,201.00 |
కోలకత్తా | రూ. 1,129.00 |
చెన్నై | రూ. 1,118.50 |
నోయిడా | రూ. 1,100.50 |
భువనేశ్వర్ | రూ. 1,129.00 |
లక్నో | రూ. 1,140.50 |
త్రివేండ్రం | రూ. 1,112.00 |
Comments
Please login to add a commentAdd a comment