ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఒక కుక్కకు రక్తదానం చేసేందుకు మరో ఆరోగ్యకరమైన కుక్కను కనుగొనాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబయి ప్రజలను కోరారు. రక్తదానం చేసే శునకానికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉండాలో తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. తన కోసం ఏదీ కోరని ఆయన ఒక కుక్క కోసం ఈ పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ముంబయిలో యానిమల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో ఇటీవల ఏడు నెలల కుక్కను అడ్మిట్ చేశారు. అది తీవ్ర జ్వరంతో, ప్రాణాంతక రక్తహీనతతో బాధపడుతోంది. ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి వెంటనే రక్తం కావాలని కోరారు. ఆ విషయం రతన్ టాటా దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.
‘ముంబయి..నాకు మీ సహాయం కావాలి. మా యానిమల్ ఆసుపత్రిలో ఉన్న ఏడు నెలల కుక్కకు అత్యవసరంగా రక్తమార్పిడి చేయాల్సి ఉంది. అది తీవ్ర జ్వరంతో, ప్రాణాంతక రక్తహీనతతో బాధపడుతోంది. మాకు అత్యవసరంగా ముంబయిలో డాగ్ బ్లడ్ డోనర్ కావాలి. రక్తం ఇచ్చే కుక్క వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. 1 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 25 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉండాలి. కనీసం గత ఆరు నెలలుగా కుక్కకు పూర్తిగా టీకాలు వేయాలి. డీవార్మింగ్(నులిపురుగులు) చేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్‌లు ఉండకూడదు’ అంటూ పోస్ట్ చేశారు.
ఆయన పోస్ట్‌కు స్పందిస్తూ చాలా మంది వ్యక్తులు కుక్క కోసం సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఆయన మంచి మనసును ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. ‘దేని కోసం పోస్ట్ చేయని లెజెండ్, తనది కాని కుక్క కోసం సహాయం కోరుతున్నారు. వినయం గురించి తెలిపే గొప్పపాఠం ఇది’ అని ఒకరు కామెంట్ చేశారు. అయితే రతన్ టాటా పోస్ట్ చూసి చాలామంది డాగ్ బ్లడ్ డోనార్లు సంప్రదించారని తెలిసింది. ‘సహాయం చేసిన వారికి నా అభినందనలు’ అంటూ రతన్ టాటా పోస్ట్‌లో పేర్కొన్నారు.
రతన్ టాటాకు మూగజీవులపై ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. వీలైతే ప్రతిఒక్కరు ఒక కుక్కను దత్తత తీసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూంటారు. టాటా గ్రూప్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ప్రాంతం చుట్టూ నివసించే వీధికుక్కల కోసం ప్రత్యేక కెన్నెల్‌ను(సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేశారు. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించే స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ను టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 200 కంటే ఎక్కువ జీవులకు వైద్యం అందించేలా 5 అంతస్తుల్లో విస్తరించి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment