సాక్షి, ముంబై: డిజిటల్ ఇండియాలో భాగంగా రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా వినియోగదారులకు కొత్త అవకాశాన్ని ప్రకటించింది. క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ లావాదేవీలకు అనుమతినివ్వనుంది. ద్వైమాసిక పాలసీ సమీక్ష, రెగ్యులేటరీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింత ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుందని శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ ప్రమోట్ చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డ్‌లతో తొలుత ఈ అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. దీనికవసరమైన సిస్టమ్ డెవలప్‌మెంట్ పూర్తయిన తర్వాత తగిన సూచాలు అందిస్తామన్నారు. అలాగే యూపీఐలో మొత్తం 26 కోట్ల మంది ప్రత్యేక వినియోగదారులు, 5 కోట్ల మంది వ్యాపారులు ఉన్నారనీ మే నెలలో 594.63 కోట్ల యూపీఐ లావాదేవీల ద్వారా రూ.10.40 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగాయని ప్రకటించారు.
ఆర్బీఐ ప్రకటించిన ఈ వెసులుబాటుతో యూపీఏ ప్లాట్‌ఫామ్స్‌కు క్రెడిట్ కార్డును లింక్ చేసి, కార్డు స్వైప్ చేయ కుండానే పేమెంట్స్ చేసుకోవచ్చు. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయవచ్చన్న మాట. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే వన్‌టైం పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తరువాత మాత్రమే పేమెంట్ పూర్తి చేయవచ్చు.
కాగా ఇప్పటివరకు యూపీఐ ఖాతాలకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే. అలాగే గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ ఆధారిత యాప్స్‌ను ఎంపిక చేసిన బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులకు అనుమతిస్తున్నాయి.
పేమెంట్స్ యాప్స్‌తో క్రెడిట్ కార్డ్ అనుసంధానం ఎలా?
♦ పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయాలి.
♦ ఆ తర్వాత పేమెంట్ మెథడ్‌ను క్లిక్ చేస్తే యాప్‌లో బ్యాంకు అకౌంట్స్ జాబితా కనిపిస్తుంది
♦ ఇక్కడ యాడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పైన క్లిక్ చేయాలి.
♦ తరువాత కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ, కార్డ్ హోల్డర్ పేరు నమోదు చేసి, సేవ్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment