ఫిన్‌టెక్‌ ఆపరేటర్లూ.. నిబంధనలను పాటించండి | Rbi Concerns On Fintech Companies Over Digital Lending Apps | Sakshi
Sakshi News home page

ఫిన్‌టెక్‌ ఆపరేటర్లూ.. నిబంధనలను పాటించండి

Published Wed, Sep 21 2022 9:50 AM | Last Updated on Wed, Sep 21 2022 10:40 AM

Rbi Concerns On Fintech Companies Over Digital Lending Apps - Sakshi

ముంబై:  పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లెండింగ్‌ యాప్‌లు, వీటికి సంబంధించి తీవ్ర స్థాయిలో వడ్డీ వసూళ్లు, రికవరీ ఏజెంట్ల ఆగడాల వంటి అంశాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో ఆవిష్కరణలను అరికట్టడం లేదా డిజిటల్‌ యాప్‌లపై తీవ్ర జరిమానాలు విధించడం పట్ల ఆసక్తిలేదని పేర్కొన్న ఆర్‌బీఐ గవర్నర్,  నిబంధనావళిని మాత్రం ఖచ్చితంగా పాటించేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.‘‘ట్రాఫిక్‌ రూల్స్‌’’ అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...  

పారదర్శకతతో స్థిరత్వం 
►    గత రెండు సంవత్సరాల నుండి రుణ యాప్‌లు, ఇందుకు సంబంధించిన ప్రతికూల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంక్‌ రూల్‌ బుక్‌లో అనేక మార్పులను చేసింది.  
►      డిజిటల్‌ లెండింగ్‌కు సెంట్రల్‌ బ్యాంక్‌ వ్యతిరేకం కాదు. దీనికి ఆర్‌బీఐ నుంచి మద్దతు ఉంటుంది. ఆయా ఆవిష్కరణలను ఆహ్వానిస్తుంది.  
►     అయితే ఈ ఆవిష్కరణలు బాధ్యతాయుతంగా ఉండాలి. సమర్థతతో పనిచేయాలి. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, వినియోగదారు ప్రయోజనాల పరిరక్షణకు దోహదపడాలి. ఈ యాప్‌లు అమాయకులు, డబ్బు అవసరమైన సాధారణ ప్రజలను దోచుకోడానికి దోహదపడకూడదు. 
►      పారదర్శక విధానాలు, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన ఫ్రేమ్‌వర్క్‌ ద్వారా ఫిన్‌టెక్‌ సంస్థల దీర్ఘకాలిక స్థిరత్వం నెలకొంటుంది.  

నిబంధనలు కఠినతరం.. 
డిజిటల్‌గా రుణాల మంజూరుకు సంబంధించి నిబంధనలను ఆర్‌బీఐ ఇటీవలే కఠినతరం చేసింది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్‌ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు.

రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు/ఆర్‌ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్‌ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్‌బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను             అడ్డగోలుగా మార్కెటింగ్‌ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. 

చదవండి: ఓలా ఎలక్ట్రిక్‌ షాక్‌: 200 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇంటికి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement