
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ లావాదేవీలు అధికమవుతున్నాయి. చాలామంది యూపీఐ, ఇమ్మిడియెట్ పేమెంట్ సర్వీస్(IMPS), ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి సదుపాయాలు వినియోగిస్తుంటారు. అందులో యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా చేసిన లావాదేవీల్లో దాదాపు ఎలాంటి అవాంతరాలు జరగడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే పేమెంట్ చేసే చివరి దశలో ఒకసారి లుక్ అప్ ఫెసిలిటీ(ఖాతా దారుడి పేరుతో వివరాలు సరి చేసుకునే సదుపాయం) ఉంటుంది. కానీ రియల్‌టైం గ్రాస్ సెటిల్‌మెంట్(RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(NEFT) ద్వారా చేసే లావాదేవీల్లో ఈ సదుపాయం ఉండదు. దాంతో కొన్నిసార్లు పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)ను ఆర్‌బీఐ కోరింది.
ఆన్‌లైన్‌లో నిర్వహించే నగదు లావాదేవీల్లో ఏదైనా పొరపాటు జరిగి వేరే అకౌంట్‌లోకి డబ్బు జమైతే తిరిగి వాటిని రాబట్టడం పెద్దపని. కాబట్టి పేమెంట్ చేసేముందే అన్ని వివరాలు సరిచూసుకుంటే సమస్య ఉండదు. ఈ నేపథ్యంలో ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల్లో జరిగే మోసాలు అరికట్టడానికి, పొరబాట్లు జరగకుండా నగదు బదిలీ చేసేందుకు ఏ ఖాతాకైతే నగదు వెళుతుందో ఆ ఖాతాదారుడి పేరును తనిఖీ చేయడానికి వినియోగదార్లకు వీలు కల్పించేలా ఒక సదుపాయాన్ని (లుక్ అప్ ఫెసిలిటీ) అందుబాటులోకి తీసుకురావాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)ను ఆర్‌బీఐ కోరింది. ఏప్రిల్ 1, 2025 వరకు ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సర్వీసు అందిస్తున్న అన్ని బ్యాంకులకు ఈ సదుపాయాన్ని అందించాలని ఆర్‌బీఐ(RBI) సూచించింది.
ఇదీ చదవండి: రూ.15,100 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించలేదు!
యూపీఐ, ఐఎంపీఎస్‌లకు ఇలా..
ఫోన్‌పే, జీపే.. వంటి థర్డ్‌పార్టీ యూపీఐ పేమెంట్ యాప్‌లు, ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న సమయంలో ఎవరికైతే డబ్బు పంపించాలో ఆ ఖాతాదారుడి పేరు వివరాలు ధ్రువీకరించే వెసులుబాటు ఉంటుంది. కానీ ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చేసే లావాదేవీలకు ఆ సదుపాయం లేదు.
Comments
Please login to add a commentAdd a comment