ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) వచ్చే వారం ద్రవ్య పరపతి విధానంలోనూ యథాతథ రెపో రేటును(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 4 శాతం) కొనసాగించే అవకాశం ఉందని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ సౌగట భట్టాచార్య సోమవారం పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయ-భౌగోళిక ఉద్రిక్తతలు దీనికి కారణమని విశ్లేషించారు. ఇటీవలి పరిణామాలు వృద్ధి, ద్రవ్యోల్బణానికి విఘాతం కలిగేలా ఉన్నాయని ఆయన అన్నారు.
ద్రవ్యోల్బణం కట్టడి-వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తున్న ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి భేటీ ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకూ జరుగుతున్న సంగతి తెలిసిందే.
చివరి ఆరునెలల్లో అరశాతం అప్
కాగా 2022-23 చివరి ఆరు నెలల్లో(2022 అక్టోబర్-2023 మార్చి) రెపో రేటు 50 బేసిస్ పాయింట్ల(100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) మేర పెరగవచ్చని భట్టాచార్య అంచనా వేశారు. 2021-22లో వృద్ధి రేటు 8.9 శాతం ఉంటే 2022-23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గవచ్చని విశ్లేషించారు. ఇక ఆర్‌బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.8 శాతంగా ఉంటుందన్నది భట్టాచార్య విశ్లేషణ. రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక క్రూడ్ ధర బ్యారల్‌కు 2021-22లో సగటున 79.6 డాలర్లుగా ఉంటే, 2022-23లో ఇది 105డాలర్లకు చేరుతుంనది ఆయన అంచనావేశారు. ఇక ఇదే కాలంలో డాలర్ మారకంలో రూపాయి విలువ సగటు 74.50 నుంచి 76.50కి తగ్గుతుందని పేర్కొన్నారు. అయితే దేశీయ కరెన్సీకి నిజమైన పరీక్ష 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎదురవుతుందని అంచనావేశారు. ఆర్‌బీఐ ప్రస్తుతం తన వద్ద ఉన్న 630 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) అస్థిరతలను అడ్డుకోడానికి, ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తుందని అన్నారు. ఇలాంటి సందర్భంలో 2023-24 రూపాయికి కీలకమవుతుందని విశ్లేషించారు.
(చదవండి: భారత్‌లో మరో మైలురాయి దాటిన లంబోర్గిని)
Comments
Please login to add a commentAdd a comment