ముంబై: రుణాల మంజూరుకు అవసరమైన డిజిటల్ వివరాలను బ్యాంకులు సులువుగా పొందేందుకు, తద్వారా రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ’పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్’ పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో రుణ గ్రహీతకు రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ లోన్‌లు, డెయిరీ రుణాలు, చిన్న .. మధ్య తరహా సంస్థలకు రుణాలు, వ్యక్తిగత.. గృహ రుణాలు వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆధార్ ఈ-కేవైసీ, శాటిలైట్ డేటా, పాన్ ధృవీకరణ, ప్లాట్‌ఫామ్‌లో చేరిన రాష్ట్రాల్లో భూమి రికార్డులు మొదలైన వాటిని అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత మరిన్ని సాధనాలు, ఆర్థిక సంస్థలకు దీన్ని విస్తరించనున్నట్లు వివరించింది.
ప్రస్తుతం డిజిటల్‌గా రుణాలివ్వాలంటే రుణ దరఖాస్తుదారు సామర్థ్యాల మదింపు ప్రక్రియకు అవసరమైన వివరాలు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు, అకౌంటు అగ్రిగేటర్లు, బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల్లాంటి వివిధ సంస్థల దగ్గర వేర్వేరుగా ఉంటున్నాయి. దీనితో ఆ వివరాలన్నింటినీ సేకరించి, రుణం మంజూరు చేయడానికి జాప్యం జరుగుతోంది. అలా కాకుండా కీలక సమాచారాన్ని నిరాటంకంగా అందుబాటులోకి తేవడం ద్వారా రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment