కరోనా తగ్గిపోయినా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇంకో సమస్యను కూడా కరోనా మోసుకొచ్చింది. అదే అప్పులు, ఆర్థిక సమస్యలు. ఖరీదైన కరోనా వైద్యం కోసం అందినకాడల్లా అప్పులు చేశారు. బంగారం లాంటి వస్తువులు తాకట్టు పెట్టారు. ఆస్తులు అమ్ముకున్నారు. దేశవ్యాప్తంగా ఏకంగా 5.5 కోట్ల మంది ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి పేదలుగా మారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం 25 రాష్ట్రాల్లోని 159 జిల్లాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు భారీగా తగ్గిపోయాయి.
ఫిక్స్‌డ్‌పై కోవిడ్ ఎఫెక్ట్
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి (గత ఆర్థిక సంవత్సరం 2020–2021) త్రైమాసికానికి సంబంధించి ఆర్బీఐ ఈ డేటాను విడుదల చేసింది. 2018 ఏప్రిల్ – జూన్ తో 53 జిల్లాల్లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు తగ్గిపోతే.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు మూడు రెట్టు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 22 జిల్లాల్లోనే ఎఫ్డీలు తగ్గడం గమనార్హం. డిపాజిట్లు భారీగా తగ్గిన జిల్లాల్లో యూపీవే 23 ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ లో 21, కర్ణాటక 16, మహారాష్ట్రలో 11 జిల్లాల్లో జనాలు ఫిక్స్ డ్ డిపాజిట్లను డ్రా చేసుకున్నారు. అయితే, అత్యధికంగా డిపాజిట్లను డ్రా చేసిన జిల్లాగా తమిళనాడులోని నాగపట్టణం నిలిచింది. అక్కడ 24 శాతం డిపాజిట్లను జనం బ్యాంకుల నుంచి తీసేసుకున్నారు
మనదగ్గర
ఆర్‌బీఐ లెక్కల ప్రకారం భారీగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు తగ్గిపోయిన జిల్లాలు తెలంగాణలోని 4 , ఆంధ్రప్రదేశ్ లోని 2 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం రెండు వరుస త్రైమాసికాల్లో 15 జిల్లాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు తగ్గాయి. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లూ ఉన్నాయి. ఇందులోనూ భద్రాద్రి, జనగామ, కరీంనగర్ సహా దేశంలోని ఏడు జిల్లాల్లో వరుసగా మూడు త్రైమాసికాల పాటు డిపాజిట్లు తగ్గినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది.
డబ్బులు డ్రా
కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక అవసరాలు పెరగడంతో డబ్బును బ్యాంకు నుంచి ప్రజలు ఉపసంహరించుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2020 మార్చి 13 నుంచి 2021 మే 21 మధ్య జనం వద్ద ఉన్న నగదులో 5.54 లక్షల కోట్ల పెరుగుదల నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జనం వద్ద చెలామణిలో ఉన్న నగదు రూ.28.62 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో సగానికి పైగా నగదు కేవలం కోవిడ్ వల్లనే ప్రజలు ఖర్చు చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment