ముంబై: బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి, గడువు ముగిసినప్పటికీ, వెనక్కి తీసుకోని వాటి (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) వివరాలను తెలుసుకునే ఉద్గమ్(యూడీజీఏఎం) పోర్టల్‌పైకి 30 బ్యాంక్‌లు చేరాయి. ఈ వివరాలను ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. ఈ పోర్టల్ సాయంతో తమ, తమవారి అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఏ బ్యాంకుల్లో ఉన్నదీ తెలుసుకోవచ్చు. ఆగస్ట్ 17 నుంచి ఈ పోర్టల్‌ను ఆర్‌బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆరంభంలో ఏడు బ్యాంక్‌లకు సంబంధించిన వివరాలే ఈ పోర్టల్‌పై అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 28 నాటికి 30 బ్యాంక్‌లకు సంబంధించిన డిపాజిట్ల వివరాలు తెలుసుకునే విధంగా అప్‌గ్రేడ్ చేసినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లలో 90 శాతం ఈ 30 బ్యాంక్‌ల కస్టమర్లకు చెందినవి కాగా, ప్రస్తుతం ఆ డిపాజిట్లు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏ) రూపంలో ఉండడం గమనార్హం.
అన్ని ప్రముఖ బ్యాంక్‌లు ఈ పోర్టల్‌తో అనుసంధానమయ్యాయి. 2023 ఫిబ్రవరి నాటికి ఎలాంటి క్లెయిమ్ రాని రూ.35,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎస్‌బీఐ కస్టమర్లకు చెందినవే రూ.8,086 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్‌బీ నుంచి రూ.5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ.4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.3,904 కోట్ల చొప్పున ఉన్నాయి. నిబంధనల కింద గడువు తీరి పదేళ్లు అయినా క్లెయిమ్ రాని డిపాజిట్లను, బ్యాంక్‌లు డీఈఏకి బదిలీ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment