ముంబై: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 13,656 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 13,680 కోట్లతో పోలిస్తే నామమాత్రంగా తగ్గింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో ఆర్జించిన రూ. 17,955 కోట్లతో పోలిస్తే నికర లాభం భారీగా క్షీణించింది.
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విండ్‌ఫాల్ ట్యాక్స్ చమురు విభాగంపై ప్రతికూల ప్రభావం చూపడంతో లాభాలు నీరసించాయి. ఇక ప్రస్తుత క్యూ2లో రూ. 31,224 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించగా.. గతేడాది క్యూ2లో రూ. 26,020 కోట్లు మాత్రమే ఆర్జించింది. క్యూ1లో ఇబిటా రూ. 37,997 కోట్లుగా నమోదైంది. తాజా సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ. 2.30 లక్షల కోట్లకు బలపడింది. గతేడాది క్యూ2లో రూ. 1.68 లక్షల కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 2.19 లక్షల కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ ఇబిటా మార్జిన్లు 13.6%కి చేరాయి. క్యూ1లో ఇవి 17.3 శాతంగా నమోదయ్యాయి.
క్యూ2లో ఇతర హైలైట్స్
► సెప్టెంబర్‌కల్లా ఆర్‌ఐఎల్ రుణ భారం రూ. 2.94 లక్షల కోట్లకు చేరగా.. నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 2.01 లక్షల కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది.
► చమురు, గ్యాస్ విభాగం రూ. 3,853 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా 2510 కోట్లు కాగా, ఇబిటా మార్జిన్లు 65% నమోదయ్యాయి.
► రిటైల్ విభాగం ఆదాయం రూ.64,936 కోట్లను తాకగా.. రూ. 4,414 కోట్ల ఇబిటా సాధించింది. ఇబిటా మార్జిన్లు 6.8 %గా ఉన్నాయి.
► ఆయిల్ టు కెమికల్ ఆదాయం రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. ఇబిటా రూ. 11,968 కోట్లు.
జియో లాభం 28% జూమ్
క్యూ2లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నికర లాభం 28 శాతం వృద్ధితో రూ. 4,518 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 22,521 కోట్లకు చేరింది. 5 శాతం అధికంగా రూ. 11,489 కోట్ల ఇబిటా సాధించింది. ఇబిటా మార్జిన్లు 0.9 శాతం బలపడి 51 శాతానికి చేరాయి. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 177.20ను తాకింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 175 మాత్రమే. సెప్టెంబర్‌కల్లా మొత్తం సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 427.6 మిలియన్లకు చేరింది. క్యూ1లో ఈ సంఖ్య 419.9 మిలియన్లు.
మార్కెట్లు ముగిశాక ఆర్‌ఐఎల్ ఫలితాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.2 శాతం క్షీణించి రూ. 2,470 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment