Reliance Jio: ఏప్రిల్ 2023లో టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో తన ఆధిపత్య స్థానాన్ని నిలుపుకోవడంలో 'రిలయన్స్ జియో' (Reliance Jio) ముందు వరుసలో నిలిచినట్లు 'టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, రిలయన్స్ జియో 2023 ఏప్రిల్ నెలలో కొత్తగా 3.04 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను పొందగలిగింది. ఇదే సమయంలో భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel) 76,328 మంది వినియోగదారులను పొందినట్లు తెలిసింది. వోడాఫోన్ ఏకంగా 2.99 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.
కాగా మొత్తం వైర్‌లెస్ చందాదారుల సంఖ్య మార్చి 2023లో 1,143.93 మిలియన్ల నుంచి ఏప్రిల్ 2023లో 1,143.13 మిలియన్లకు తగ్గింది. దీని ప్రకారం నెలవారీ క్షీణత రేటు 0.07 శాతం. ఈ విషయంలో పట్టణ ప్రాంతాల వారి కంటే గ్రామీణ ప్రాంతాల్లో సంఖ్య పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
(ఇదీ చదవండి: హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మిస్ చేసుకుంటే మళ్ళీ రాదేమో!)
టెలికామ్ రంగంలో ప్రైవేట్ హవా కొనసాగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 90 శాతం వాటా వీరిదే ఉందని తెలుస్తోంది. ఒక్క రిలయన్స్ జియో వాటా 37.9 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఎయిర్‌టెల్ 32.4 శాతం, వోడాఫోన్ 20.4 శాతంలో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL), ఎమ్‌టీఎన్‌ఎల్ (MTNL) వాటా కేవలం 9.2 శాతం కావడం గమనార్హం. రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగంలో మరింత తగ్గిపోయే అవకాశాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment