ముఖేష్ అంబానీ నేతృత్వంలోని భారీ వ్యాపార సమ్మేళనం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Limited) వివిధ రంగాలకు విస్తరిస్తోంది. పెద్ద పెద్ద అంతర్జాతీయ బ్రాండ్‌లను భారత్‌కు తీసుకొస్తోంది. వాటితో భాగస్వామ్యం చేసుకుని విభిన్న వ్యాపారాల్లోకి అడుగు పెడుతోంది. ఈసారి యూకేకి చెందిన వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ (Walgreens Boots Alliance Inc) అనే భారీ ఫార్మాస్యూటికల్ కంపెనీతో ఒప్పందాన్ని చేసుకుంటోంది.
భారీ మొత్తంలోనే ఆఫర్
వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ అనేది యునైటెడ్ కింగ్‌డమ్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ. దీన్ని కొనుగోలు చేసి మెడికల్ స్టోర్‌లు, ఫార్మా వ్యాపారాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ మేరకు వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని దానికి సంబంధించిన అంతర్జాతీయ మెడిస్టోర్‌లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందు కోసం యూకే కంపెనీకి అంబానీ భారీ మొత్తంలోనే ఆఫర్ చేసినట్లు తెలిసిందని బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది.
కన్సార్టియం ఏర్పాటు
ఔట్‌లుక్, ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్, యూఎస్‌లో ఉన్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ చైన్ స్టోర్‌లను కొనుగోలు చేయడానికి యూఎస్ ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఐఎన్‌సీ సంస్థతో ఒక కన్సార్టియంను ఏర్పాటు చేస్తోంది. ఫార్మా బ్రాండ్ స్టోర్‌లను కొనుగోలు చేయడానికి వాల్‌గ్రీన్స్‌తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న రిలయన్స్ ఇందు కోసం భారీ మొత్తాన్ని ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాల్‌గ్రీన్స్
కంపెనీ విలువ సుమారు 6.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 53,600 కోట్లు.
కష్టాల్లో ఉన్న వాల్‌గ్రీన్స్
ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని ఆన్‌లైన్ మార్కెట్‌లకు విస్తరించినప్పటి నుంచి వాల్‌గ్రీన్స్ కష్టాల్లో ఉంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఒప్పందం కుదిరితే, ఈ కంపెనీ తమ సంస్థలో స్వల్ప వాటాను మాత్రమే కలిగి ఉంటుంది. మెజారిటీ రిలయన్స్ నియంత్రణలో ఉంటుంది. రిలయన్స్-వాల్‌గ్రీన్స్ ఒప్పందం విజయవంతమైతే, ముఖేష్ అంబానీ ఈ యూకే కంపెనీని భారతదేశంలో కంపెనీని పరిచయం చేసి ఆన్‌లైన్ డ్రగ్ స్టోర్ల ద్వారా లాభాలను పెంచుతారని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న టాటా 1ఎంజీ, అపోలో ఫార్మసీ వంటి వాటికి గట్టి పోటీ తప్పదు. కాగా గత సంవత్సరంలోనే ముఖేష్ అంబానీ యూకే కంపెనీ ఈ ఆఫర్ చేశారు. దీనిపై వాల్‌గ్రీన్స్ బూట్స్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు!
Comments
Please login to add a commentAdd a comment