
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఇంధన డిమాండ్‌కి కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపంలో గండం వచ్చి పడింది. కోవిడ్-19 కట్టడి కోసం ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌లు, ఆంక్షలు విధిస్తుండటంతో డిమాండ్ రికవరీపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు పరిమిత స్థాయిలో లాక్‌డౌన్‌లు అమలు చేస్తుండటంతో ప్రయాణాలు, వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. మిగతా రాష్ట్రాలు కూడా వివిధ సమయాల్లో కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి.
‘ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికన్నా ముందుగా ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇంధన వినియోగం కూడా దెబ్బతింటుంది‘ అని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘ఈ నెలలో సీఎన్‌జీ అమ్మకాలు 20-25 శాతం దాకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా కొత్త వాహనాలు వస్తే మార్కెట్ మరింతగా పెరుగుతుంది. కానీ లాక్‌డౌన్‌లు విధిస్తే కొత్త వాహనాల అమ్మకాలు దాదాపుగా నిల్చిపోయినట్లే అవుతుంది‘ అని మరో అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంధన వినియోగం దాదాపు 10 శాతం పెరగవచ్చని కోవిడ్-19 కేసులు విజృంభించడానికి ముందు కేంద్ర చమురు శాఖ అంచనా వేసింది. అయితే, కేసులు మరో నెల రోజుల పాటు ఇలాగే కొనసాగితే ఇంధన అమ్మకాల అంచనాలను సవరించుకోవాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ద్వితీయార్థంలోనూ డౌన్ ట్రెండే!
తాజాగా ఈ ఏడాది మార్చితో పోలిస్తే డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనం, ఎల్‌పీజీకి ఏప్రిల్ ప్రథమార్థంలో డిమాండ్ తగ్గిపోయింది. డీజిల్‌కు డిమాండ్ 3 శాతం, పెట్రోల్ అమ్మకాలు 5 శాతం పడిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం కరోనాకు ఎదురీదిన ఎల్‌పీజీ డిమాండ్ కూడా ప్రస్తుత ఏప్రిల్ ప్రథమార్ధంలో 6.4 శాతం క్షీణించగా, విమాన ఇంధన అమ్మకాలు 8 శాతం పడిపోయాయి. మరిన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లను విధిస్తుండటంతో ద్వితీయార్థంలో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది.
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కఠినతరమైన ఆంక్షలు అమలు చేయడంతో గత ఆర్థిక సంవత్సరం ఇంధన డిమాండ్ 9.1 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ)గణాంకాల ప్రకారం 2019-20లో నమోదైన 214.12 మిలియన్ టన్నులతో పోలిస్తే 2020-21లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 194.63 మిలియన్ టన్నులకు పడిపోయింది. డీజిల్ వినియోగం అత్యధికంగా 12 శాతం, పెట్రోల్ డిమాండ్ సుమారు 7 శాతం తగ్గిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment