దేశంలో ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారి నేపథ్యం, వ్యక్తిగత విషయాలపైనా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తుంటారు. వారిలో హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా ఒకరు. ఇటీవల ఆయన వార్తల్లోకి వచ్చారు.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న అమిత్ కటారియా దేశంలోనే అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారులలో ఒకరిగా వెలుగులోకి వచ్చారు. ఈ ప్రత్యేకత గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. అంత సంపన్నుడైన ఆయన సర్వీస్‌లో చేరిన కొత్తలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు. దీంతో ప్రజాసేవ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించారు.
అమిత్ కటారియా విద్యా నేపథ్యం కూడా అద్భుతంగా ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. కటారియా తన పాఠశాల విద్యను ఆర్‌కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. 2003లో యూపీఎస్‌ఈ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చోటు సంపాదించారు.
ఉన్నత వ్యాపార కుటుంబం
అమిత్ కటారియా రియల్ ఎస్టేట్‌లో స్థిరపడిన వ్యాపార కుటుంబం నుండి వచ్చారు. వీరికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో మంచి లాభాలు ఇస్తున్న వెంచర్‌లు ఉన్నాయి. సంపన్నుడైనప్పటికీ కటారియా తన కెరీర్ ప్రారంభంలో సర్వీస్‌లో చేరిన తర్వాత కేవలం రూపాయి వేతనం తీసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.
అయితే కొన్ని సందర్భాలలో తన చర్యలతో వివాదాస్పదమూ అయ్యారు. 2015లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా స్వాగతం పలుకుతూ సన్ గ్లాసెస్ ధరించడం వివాదాస్పదం అయ్యింది. దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది.
ఇక వ్యక్తిగత విషయానికి వస్తే అమిత్ కటారియా కమర్షియల్ పైలట్ అయిన అశ్మిత హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా తమ వ్యక్తిగత విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా అమిత్ కటారియా నెట్‌వర్త్ సుమారు రూ.8.90 కోట్లని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment