న్యూఢిల్లీ: రిస్కులను ఎదుర్కోవడమనేది కంపెనీల రోజువారీ డిఎన్‌ఏలోనే ఉండాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్ పేర్కొన్నారు. రిస్కులనేవి పెద్ద కంపెనీలకే కాదని, చిన్న సంస్థలూ వీటిని ఎదుర్కోవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. మోడల్ రిస్క్ కోడ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. రిస్క్‌ల నిర్వహణలో ఈ కోడ్ ఆచరణాత్మక సాధనం (టూల్ కిట్) వంటిదని దామోదరన్ పేర్కొన్నారు.
దేశీ పరిశ్రమల పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, గ్లోబల్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (జీఆర్‌ఎంఈ) కలిసి దీనికి రూపకల్పన చేశాయి. దామోదరన్ సారథ్యంలోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఈ కోడ్‌ను తీర్చిదిద్దింది. కోడ్ ప్రధానంగా రిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కీలక మూలసూత్రాలు, రిస్క్ నిర్వహణను అమలు చేయడం అనే రెండు కీలక అంశాల ఆధారంగా రూపొందింది. ఇది వ్యాపారాల నిర్వహణలో మార్గదర్శిగా నిలవడంతోపాటు.. అన్ని విభాగాలలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడంలో తోడ్పాటునిస్తుంది. కోడ్ ప్రధానంగా లిస్టెడ్, పబ్లిక్ అన్‌లిస్టెడ్, ప్రయివేట్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలు, సొసైటీలు, ట్రస్ట్‌లను ఉద్ధేశించి రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment