ఆన్‌లైన్ మోసాలకు అంతం లేకుండా పోతోంది. ముఖ్యంగా నిరుద్యోగులనే మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో రూ.కోటి మోసం వెలుగు చూసిన మరుసటి రోజే మరో భారీ స్కామ్ బయటపడింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటూ అమాయకులను మోసం చేసి రూ.158 కోట్ల స్కామ్‌కి పాల్పడిన ముఠాను బెంగళూరు సిటీ పోలీసులు పట్టుకున్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అమీర్ సోహైల్, ఇనాయత్ ఖాన్, ముంబైకి చెందిన సయ్యద్ అబ్బాస్ అలీ, మిథున్ మనీష్ షా, నైనా రాజ్, సతీష్, మిహిర్ శశికాంత్ షా, హైదరాబాద్‌కు చెందిన నయాజ్, ఆదిల్ పట్టుబడ్డారు. మరో ఇద్దరు అనుమానితులను పట్టుకోవాల్సి ఉంది.
ఇలా మోసగించారు..
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌ల ముసుగులో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సందేహాస్పద ఫోన్ నంబర్‌లతో అమాయకులకు ఈ ముఠా చేరువయ్యారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టడం, యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి సులువైన పనులను అప్పగించి పూర్తయ్యాక డబ్బులిస్తామని నమ్మించారు. ఇలా నమ్మినవారితో కొద్దికొద్దిగా డబ్బులు తీసుకున్నారు.
బాధితులు తమ డిజిటల్ వాలెట్లు వివిధ దశల్లో క్రెడిట్ అవుతున్నట్లు చూడగలిగినప్పటికీ, ఆ డబ్బు డ్రా చేసుకుకోవడానికి ప్రయత్నించే వరకు మోసం బయటపడలేదు. తమ డిజిటల్ ఖాతాలు నకిలీవని, స్కామ్‌కు గురయ్యారని వారు గ్రహించి బాధితులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ ప్రారంభించారు.
రూ. 18.5 లక్షలు పోగొట్టుకున్నట్లు విద్యారణ్యపురకు చెందిన బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీబీ అధికారులు 30 బ్యాంకు ఖాతాల్లో రూ.62.8 లక్షలను స్తంభింపజేశారు. తదుపరి దర్యాప్తులో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సిఆర్‌పి) ద్వారా 28 రాష్ట్రాల్లో నమోదైన 2,143 సైబర్ క్రైమ్ కేసుల్లో దీని వెనుక ఉన్న అనుమానితుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. కర్ణాటకలో నమోదైన మొత్తం 265 కేసుల్లో బెంగళూరు లోని 14 పోలీస్ స్టేషన్లలోనే 135 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment