
Russian Billionaire Vladimir Costly Divorce Case News: రష్యన్ బిలియనీర్ వ్లాదిమిర్ పొటానిన్ అత్యంత ఖరీదైన విడాకులతో వార్తల్లోకెక్కాడు. ఏకంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన(మన కరెన్సీలో అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది) విడాకుల భరణం కోరుతూ ఆయన భార్య(మాజీ) కోర్టుకెక్కింది. తద్వారా జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ తర్వాత అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా రికార్డుల్లోకి ఎక్కింది ఇది.
వ్లాదిమిర్ పొటానిన్.. రష్యాలోనే రెండో రిచ్చెస్ట్ పర్సన్. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన సంపద 29.9 బిలియన్ డాలర్లుగా ఉంది. 31 ఏళ్ల కాపురం తర్వాత వ్లాదిమిర్ పొటానిన్, నటాలియా పొటానినా విడాకులకు సిద్ధమయ్యారు. అయితే ఖనిజం ఫ్యాక్టరీ ఎంఎంసీ నోరిల్‌స్క్ నికెల్ పీఎస్‌జేసీలో వ్లాదిమిర్‌కు చెందిన వాటా నుంచి యాభై శాతం భరణంగా ఇప్పించాలంటూ మాజీ భార్య నటాలియా లండన్ కోర్టుకు ఎక్కింది. ఆ విలువ ఏడు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. అంతేకాదు ఆయన వ్యాపారాల్లో ఆ విలువ మూడో వంతు పైనే ఉంటుంది.
ఇలాంటి హైప్రొఫైల్ కేసులకు తీర్పులు ఇవ్వడంలో లండన్ కోర్టుకు ఘన చరిత్రే ఉంది. గతంలో బిలియనీర్ ఫర్ఖద్ అఖ్హ్‌మెదోవ్ విడాకుల కేసులో 450 మిలియన్ పౌండ్ల భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది కూడా. ఇంతకు ముందు నటాలియా పొటానీనా కింది కోర్టులో 84 మిలియన్ డాలర్లు కోరగా.. 40 మిలియన్ డాలర్లకు జడ్జి తీర్పు ఇచ్చారు. కానీ, పొటానీనా మాత్రం భారీ భరణం కోరుతూ ఈసారి లండన్ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పోటానిన్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మాక్‌మెకంజీ స్కాట్‌కు 36 బిలియన్ డాలర్లు విడాకుల భరణం చెల్లించగా.. బిల్‌గేట్స్, మిలిండాకు 26 బిలియన్ డాలర్ల భరణం చెల్లించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో మూడో బిలియనీర్‌గా ఖరీదైన విడాకుల జాబితాలో వ్లాదిమిర్ నిలుస్తాడా? లేదా? అన్నది తెలియడానికి కొంత టైం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment