T-Hub CEO Srinivasa Rao Interview With Sakshi In Telugu: Know Interesting Facts - Sakshi
Sakshi News home page

T Hub CEO Latest Interview: ఇక స్టార్ట్‌..‘అప్‌’!

Published Thu, Dec 16 2021 4:08 AM | Last Updated on Thu, Dec 16 2021 10:44 AM

Sakshi Special Interview With T Hub Ceo Srinivasa Rao

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఏడేళ్ల క్రితం స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌గా పురుడు పోసుకున్న టీ–హబ్‌ ప్రస్తుతం నూతన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారిందని టీ–హబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు అన్నారు. కరోనా సంక్షోభంతో ఏర్పడిన పరిస్థితుల నుంచి స్టార్టప్‌లు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే వాతావరణం సృష్టిస్తామన్నారు. టీ–హబ్‌ ద్వారా ఇప్పటివరకు 1,800కుపైగా స్టార్టప్‌లకు తోడ్పాటు లభించగా సుమారు రూ. 2,300 కోట్ల మేర నిధుల సమకూరాయన్నారు. టీ–హబ్‌ రెండో దశ వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సంస్థ ప్రస్థానం, భవిష్యత్‌ ప్రణాళికలపై శ్రీనివాస్‌రావు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

► స్టార్టప్‌లకు అవసరమైన పని ప్రదేశాన్ని (వర్క్‌ స్పేస్‌) అందుబాటులో తెచ్చే లక్ష్యంతో ఏర్పాటైన టీ–హబ్‌ తర్వాతి కాలంలో వాటికి అవసరమైన మార్కెటింగ్, నిధులు, సలహాదారులు, మార్గదర్శకులు, నైపుణ్యం, ప్రోత్సాహం తదితరాలను అందించేలా కార్యకలాపాలను విస్తరించింది.
 
►   ఉద్యోగాల కల్పనలో స్టార్టప్‌లదీ కీలకపాత్ర. ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్‌లు కేవలం రెండు వేలుకాగా ఇప్పుడు ఆరు వేలకుపైగా ఉన్నాయి. ఈ పురోగతిలో టీ–హబ్‌ కీలక పాత్ర పోషించింది.
 
►    ఆవిష్కరణలు (ఇన్నోవేషన్‌), వాటికి వాణిజ్య రూపం (ఇంక్యుబేషన్‌) ఇవ్వ డంలో టీ–హబ్‌ నాయకత్వ స్థానంలో ఉంది. 29 రాష్ట్రాల్లో 356 ఇంక్యుబేటర్లు ఉన్నా టీ–హబ్‌ మాత్రమే రోల్‌మోడల్‌గా ఉంది. Ü ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, సైబర్‌ భద్రత, సోషల్‌ మీడియా, బ్లాక్‌చెయిన్, రవాణా, ఏఐ వంటి 14 రంగాల్లో స్టార్టప్‌లు వాణిజ్య స్థాయికి ఎదుగుతున్నాయి.
 
►   స్టార్టప్‌లకు కావాల్సిన మార్కెట్, నిధులు, మార్గదర్శకులు, నైపుణాన్ని అందించడమే టీ–హబ్‌ ప్రధాన లక్ష్యం. పెద్ద కంపెనీలకు స్టార్టప్‌లను చేరువ చేయడం కూడా మా లక్ష్యాల్లో భాగం. 

    హైదరాబాద్‌ స్టార్టప్‌లకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోంది. స్థానిక స్టార్టప్‌లకు భారీ పెట్టుబడులు సాధిం చేందుకు యాక్టివ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ అసోసియేషన్‌తో మాట్లాడుతున్నాం. 

   నైపుణ్యం, పెట్టుబడి, ప్రభుత్వం, మార్కెటింగ్‌ను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీ–హబ్‌తోపాటు వీ–హబ్, టాస్క్, టీఎస్‌ఐసీ సంస్థలు పనిచేస్తుండగా 300కుపైగా వెంచర్‌ క్యాపిటలిస్టులు కూడా ఉన్నారు. స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు స్టేట్‌ ఇన్నోవేషన్‌ పాలసీలో భాగంగా ప్రభుత్వం ప్రారంభించిన టీ–ఫండ్‌ ద్వారా త్వరలో రూ. 15 కోట్లు అందుబాటులోకి వస్తాయి. 

    టీఎస్‌ఐసీ భాగస్వామ్యంతో కరీంనగర్, ఖమ్మం వంటి పట్టణాల్లోనూ త్వరలో టీ–హబ్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తాం.
 
   యువతకు చేరువయ్యేందుకు టీ–ట్రైబ్, కిక్‌ స్టార్ట్, లాంచ్‌పాడ్‌ అనే కార్యక్రమాలు రూపొందించాం.
 
   లాంచ్‌పాడ్‌ ద్వారా 30 కాలేజీల నుంచి 50 మంది విద్యార్థుల చొప్పున ఎంపిక చేసుకొని వారికి స్టార్టప్‌లపై శిక్షణ ఇస్తాం. కొన్ని కాలేజీల్లో ఉన్న ఈ–సెల్స్‌ ద్వారా కిక్‌స్టార్ట్‌ ప్రోగ్రామ్‌ కింద ఉపాధ్యాయుల సహకారంతో ఆవిష్కర్తలను గుర్తిస్తాం. టై, సీఐఐ, వీ–హబ్‌తోనూ క లసి రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కరణ వాతావరణం కల్పన దిశగా ముందుకు సాగుతాం.

ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఉన్న టీ–హబ్‌ మొదటి దశలో 160 స్టార్టప్‌లు ఇంక్యుబేట్‌ అవుతుండగా రెండో దశ ద్వారా 3.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 800కుపైగా స్టార్టప్‌లు ఒకేచోట సిద్ధమయ్యేలా వసతులు సమకూరుస్తాం. 

► నీతి ఆయోగ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో ప్రస్తుతం టీ–హబ్‌ నాలుగో స్థానంలో ఉన్నా ఎంత వేగంగా దీన్ని సాధించామన్నది కూడా ముఖ్యమే. రాష్ట్రంలోని ప్రగతిశీల ప్రభుత్వం, మౌలిక వసతులు, నైపుణ్యం తదితరాల మూలంగా తప్పకుండా తొలి స్థానానికి చేరుకుంటాం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement