
Salman Khan About Salman Talkies: నటుడిగానే కాదు.. నిర్మాతగా, ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌గా , బీయింగ్ హ్యూమన్ లాంటి బ్రాండ్‌తో వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్. ఇప్పుడీ సీనియర్ హీరో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడు. చిన్న చిన్న పట్టణాల్లో థియేటర్ల చెయిన్‌తో ప్రేక్షకుడిని అలరించబోతున్నాడు. ‘సల్మాన్ టాకీస్’ పేరిట వీటిని నడిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముందు మహారాష్ట్రలో మొదలుపెట్టి.. ఆ తర్వాతి పదేళ్లలో దేశం మొత్తం విస్తరించాలన్నది సల్లూ భాయ్ ప్లాన్.
నిజానికి ఈ ప్రాజెక్టు కొన్నేళ్ల క్రితం ప్రతిపాదనే. అయితే అది ఆగిపోయిందని అంతా భావించారు. ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా సల్మాన్ టాకీస్ గురించి వార్త చక్కర్లు కొడుతుండడంతో.. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా సల్మాన్ ధృవీకరించాడు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సల్మాన్ టాకీస్ ప్రాజెక్ట్‌ను లాంఛ్ చేయనున్నట్లు వెల్లడించారు. ‘ముంబై లాంటి మహానగరాల్లో కాదు.. థియేటర్ సౌలభ్యం లేని చిన్న ఊర్లలో వీటిని ప్రారంభిస్తాం. పనులు కరోనా వల్ల కాస్త ఆలస్యం అవుతోంది అంతే!’ అని సల్మాన్ వెల్లడించాడు.
చిన్న చిన్న పట్టణాల్లో ట్యాక్స్ ఫ్రీ టికెట్లతో అనుమతులతో థియేటర్ల చెయిన్ ‘సల్మాన్ టాకీస్’గా వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా మాస్ ఆడియొన్స్‌ను దృష్టిలో పెట్టుకుని వీటిని మొదలుపెడుతున్నాడు సల్మాన్. అంతేకాదు టికెట్లపై సబ్సిడీ రేట్లు, పిల్లలకు ఉచిత టికెట్లతో వీటిని నడిపించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో చాలాకాలం సల్మాన్ చర్చలు జరిపినట్లు ముంబై మిర్రర్ ఒక కథనం ప్రచురించింది.
సినిమాలతోనే కాదు.. బిగ్‌బాస్‌లాంటి రియాలిటీ షోల ద్వారా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు సల్మాన్. ఇక 2011లో సల్మాన్ సొంత ప్రొడక్షన్ హౌజ్ ‘సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ ప్రొడక్షన్స్ హౌజ్ ప్రారంభించాడు. ఈ బ్యానర్‌లో తీసిన సినిమాల ద్వారా వచ్చిన సొమ్ము.. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌కు వెళ్తోంది. ఇక బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ బ్రాండ్ సాలీనా టర్నోవర్ 500 కోట్ల రూపాయలుగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment