సొంత ఖర్చులకు 10 శాతమే..
సెలబ్రిటీ స్టైల్..
సినిమాలతో కావొచ్చు.. వివాదాలతో కావొచ్చు.. నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటుంటాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఓవైపు సూపర్ హిట్ సినిమాలు .. మరోవైపు టీవీ షోలు, ప్రకటనలతో ఓ వెలుగు వెలుగుతున్నాడు. వందల కోట్లు ఆదాయాన్ని అందుకుంటున్నాడు. మరి ఈ ఆదాయాన్ని సల్మాన్ ఏం చేస్తున్నాడు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు.. ఏదైనా దాచిపెడుతున్నాడా లేదా? ఇలాంటి వాటికే సమాధానాలు సెలబ్రిటీ స్టయిల్‌లో..
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సంపద విలువ దాదాపు రూ.1,200 కోట్లు ఉంటుందని అంచనా. సినిమాకు దాదాపు రూ. 25-30 కోట్లతో పాటు లాభాల్లో వాటాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లకు రూ. 1.5 కోట్లు తీసుకుంటాడుట సల్మాన్. టీవీ షో బిగ్‌బాస్‌లో కూడా చేసిన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 6లో ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 2.5 కోట్లు తీసుకున్నాడు. సీజన్ 7లో దానికి రెట్టింపు స్థాయిలో రూ. 5 కోట్లు వసూలు చేశాడు. సీజన్ మొత్తంలో 26 ఎపిసోడ్‌లకు గాను రూ. 130 కోట్లు దక్కించుకున్నాడు.
అయితే, వందల కోట్లు ఆర్జిస్తున్నప్పటికీ.. కెరియర్ ప్రారంభంలో డబ్బుకు సంబంధించి తండ్రి సలీమ్ ఖాన్ ఇచ్చిన సలహాకు కట్టుబడి ఉంటాడట సల్మాన్. సంపాదించిన దాంట్లో కేవలం 10 శాతం మాత్రమే సొంతానికి ఖర్చు చేయాలని, మిగతాది పొదుపు చేయడమో లేదా సత్కార్యాలకు ఉపయోగించడమో చేయమని కెరియర్ తొలినాళ్లలో సలీమ్ ఖాన్ సలహా ఇచ్చారట.
దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతుంటాడు సల్మాన్. ఆదాయంలో కొంత భాగాన్ని.. తాను ఏర్పాటు చేసిన బీయింగ్ హ్యూమన్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకలాపాలకు వినియోగిస్తుంటాడని సన్నిహితులు అంటారు.
వ్యాపార రంగంలోకి..
సల్మాన్ ఖాన్.. మెల్లగా వ్యాపార రంగంపై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం ట్రావెల్ పోర్టల్ యాత్రాడాట్‌కామ్‌లో సల్మాన్‌కి దాదాపు అయిదు శాతం వాటాలు ఉన్నాయి. అలాగే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ అడుగుపెడుతున్నాడు. ముంబైలోని బాంద్రాలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌కి ప్లాన్ చేస్తున్నాడు. అటు, ముంబైలోని కార్టర్ రోడ్, వర్లి తదితర ప్రాంతాలతో పాటు దుబాయ్‌లోనూ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాడు. షారుఖ్‌తో పోటీగా రూ.110 కోట్ల ఫ్లాట్ తీసుకున్నాడు. మరోవైపు, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ తరహాలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ జట్లపై ఇన్వెస్ట్ చేసే యోచనలో కూడా ఉన్నాడు. ఇవి కాకుండా సొంత ప్రొడక్షన్ హౌస్‌తో సినిమాల నిర్మాణం కూడా చేపట్టాడు.