ముకేశ్‌.. మారథాన్‌! | Saudi Arabia is PIF invests Rs9,555 crore in Reliance Retail | Sakshi
Sakshi News home page

ముకేశ్‌.. మారథాన్‌!

Published Fri, Nov 6 2020 4:41 AM | Last Updated on Fri, Nov 6 2020 7:21 AM

Saudi Arabia is PIF invests  Rs9,555 crore in Reliance Retail - Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ దిగ్గజం ముకేశ్‌ అంబానీ నిధుల వేటలో దూసుకుపోతున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ వ్యాపార అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లోకి మరో భారీ పెట్టుబడి వచ్చిచేరింది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (పీఐఎఫ్‌) తమ సంస్థలో 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనుందని, దీనిద్వారా రూ.9,555 కోట్ల నిధులను సమీకరించినట్లు ఆర్‌ఆర్‌వీఎల్‌ గురువారం ప్రకటించింది. తాజా పెట్టుబడుల సమీకరణతో రిలయన్స్‌ రిటైల్‌ విభాగం విలువ దాదాపు రూ.4.587 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. కాగా, గడిచిన రెండు నెలల్లో (సెప్టెంబర్‌ 9 నుంచి ఇప్పటివరకూ) ఆర్‌ఆర్‌వీఎల్‌లోకి మొత్తం రూ.46,265 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. కంపెనీలో 10.52 శాతం వాటాను ఎనిమిది మంది ఇన్వెస్టర్లకు విక్రయించింది.

జియోలోనూ పెట్టుబడి...
సౌదీ పీఐఎఫ్‌కు రిలయన్స్‌ గ్రూప్‌పై గురి బాగానే కుదిరింది. ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీనికోసం రూ.11,367 కోట్లను కుమ్మరించింది. తాజాగా రిటైల్‌లోనూ అడుగుపెట్టడం ద్వారా అంబానీ కంపెనీల్లో పీఐఎఫ్‌కు ఇది రెండో పెట్టుబడి కానుంది. కాగా, జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఫేస్‌బుక్, ఇంటెల్, గూగుల్‌ సహా మొత్తం 13 అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు వాటా విక్రయం ద్వారా రూ.1.52 లక్షల కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.  వచ్చే ఐదేళ్లలోపు ఆయా విభాగాలను పబ్లిక్‌ ఇష్యూతో స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయాలనేది రిలయన్స్‌ ప్రణాళిక. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.15 లక్షల కోట్లను మించిపోగా, ఇందులో రిటైల్, జియోల విలువ రూ.9 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.

ధనాధన్‌ రిటైల్‌...
ఆర్‌ఆర్‌వీఎల్‌ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్‌ రిటైల్‌కు వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 12,000 పైగా స్టోర్స్‌ ఉన్నాయి. కరోనా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.39,199 కోట్ల ఆదాయాన్ని రూ. 2,099 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. సమీకరిస్తున్న ఈ భారీ నిధులతో రిలయన్స్‌ రిటైల్‌ అటు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఈ–కామర్స్‌ కంపెనీలతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న పలు ఆన్‌లైన్‌ ఫార్మాట్‌లకు తోడు కిరాణా సరుకుల అమ్మకాలకు  ప్రత్యేకంగా జియోమార్ట్‌ను ప్రారంభించడం తెలిసిందే.

సౌదీ అరేబియాతో మాకు(రిలయన్స్‌) దీర్ఘాకాలికంగా మంచి సంబంధాలు ఉన్నాయి. సౌదీ ఆర్థిక పురోభివృద్ధిలో పీఐఎఫ్‌ చాలా కీలకపాత్ర పోషిస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌లోకి ఒక విలువైన భాగస్వామిగా పీఐఎఫ్‌ను ఆహ్వానిస్తున్నాను. ఈ సంస్థ అందించే మద్దతు, మార్గదర్శకత్వాన్ని కూడా ఉపయోగించుకొని 130 కోట్ల మంది భారతీయులు, అలాగే లక్షలాది మంది చిన్న వర్తకుల జీవితాలను మెరుగుపరచడం కోసం భారత్‌ రిటైల్‌ రంగాన్ని సమూలంగా మార్చివేసేందుకు మా ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని కొనసాగిస్తాం.
  
 
– ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ అధినేత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement