ముంబై: పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన గృహ రుణాలకు సంబంధించి అవలంబిస్తున్న వడ్డీరేట్లపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వరకూ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.75 లక్షలకుపైగా రుణం, సిబిల్ స్కోర్, బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా దరఖాస్తు చేసుకోవడం వంటి అంశాల ప్రాతిపదికన తాజా రాయితీ వర్తిస్తుందని బుధవారం విడుదలైన బ్యాంక్ ప్రకటన తెలిపింది. ప్రకటనకు సంబంధించి మరిన్ని అంశాలను పరిశీలిస్తే...
► రూ. 30 లక్షలకుపైబడి, రూ.2 కోట్ల వరకూ గృహ రుణాలపై క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రాయితీ ఇప్పటి వరకూ 10 బేసిస్ పాయింట్లు ఉంది. ఇకపై ఈ రాయితీని 20 బేసిస్ పాయింట్లకు పెంచుతున్నట్లు తెలిపింది.
► ఎనిమిది మెట్రో నగరాల విషయంలో రూ.3 కోట్ల రుణం వరకూ ఇదే క్రెడిట్ స్కోర్ ఆధారిత వడ్డీరేటు విధానం అమలవుతుంది. యోనో ద్వారా దరఖాస్తుచేస్తే, అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది.
► ప్రస్తుతం బ్యాంక్ రూ.30 లక్షల వరకూ గృహ రుణంపై 6.9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. రూ.30 లక్షలుపైబడితే ఈ రేటు 7 శాతంగా ఉంది. ఈ విషయంలో మహిళలకు మరో 5 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ ఉంది.
► ఎస్‌బీఐ ‘యోనో’ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును ఎస్‌బీఐ 100 శాతం మాఫీ చేస్తోంది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి కూడా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తోంది.
► కార్ లోన్ తీసుకునే వారికి వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన మోడల్స్‌పై 100 శాతం ఆన్–రోడ్ ఫైనాన్స్ కూడా లభిస్తుంది. మరోవైపు, అత్యంత తక్కువగా 7.5 శాతం వడ్డీ రేటుకే పసిడి రుణాలు కూడా అందిస్తోంది.
► వ్యక్తిగత రుణాలపై 9.6% నుంచి వడ్డీ రేటు ఉంటోంది.
► ఎస్‌బీఐకి గృహ రుణాల విభాగంలో దాదాపు 34 శాతం, వాహన రుణాల విభాగంలో సుమారు 33 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు 7.6 కోట్లకు పైగా ఎస్‌బీఐ ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.7 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు.
డిమాండ్ వృద్ధిపై విశ్వాసం: ఎస్‌బీఐ
కాగా అధిక ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణ వృద్ధి్దకి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడంలేదని బ్యాంకింగ్ పరిశ్రమ పేర్కొంటోంది. రుణ వృద్ధి పలు సంవత్సరాల కనిష్టస్థాయి 6 శాతం వద్దే కొనసాగుతుండడం గమనార్హం. అయితే క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయనీ, వినియోగ విశ్వాసం, డిమాండ్ మెరుగుపడుతుందనీ, ప్రత్యేకించి ఎస్‌బీఐ ఇస్తున్న గృహ రుణ ఆఫర్లు ఈ విభాగంలో డిమాండ్ పెరుగుతుందని విశ్వసిస్తున్నామని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి పేర్కొన్నారు.
ప్రైవేటు బ్యాంకుల పోటీ...
పండుగల సీజన్‌లో డిమాండ్‌ను సొంతం చేసుకోడానికి ప్రైవేటు బ్యాంకులూ ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. యస్‌బ్యాంక్ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, రుణాలు, తక్కువ వ్యయ ఈఎంఐలు, గిఫ్ట్ వోచర్ల విషయంలో ప్రాసెసింగ్ ఫీజు రద్దుసహా పలు ఆఫర్లను ఇస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ‘ఖుషియోంకీ కరే జిమ్మెదారి సే తయారీ’ పేరిట ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపింది. 100 శాతం ఆన్–రోడ్ ధరతో 7.99 శాతం నుంచి కారు రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 72 నెలల అత్యధిక కాలవ్యవధితో 10.45 శాతం ప్రారంభ వడ్డీకి రూ.50 లక్షల వరకూ వ్యక్తిగత రుణం పొందే సౌలభ్యం ఉన్నట్లు వివరించింది.
రూ.799 ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజుతో 10.99 శాతానికి పడిసి రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేటు ఇప్పటికే 7 శాతానికి తగ్గింది. పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్, వ్యవసాయ రంగాలకు సంబంధించి రుణ ప్రాసెసింగ్ ఫీజు రద్దు, వేగవంతమైన ఆన్‌లైన్ ఆమోదాలు వంటి ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. కారు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహన, నిర్మాణ పరికరాల రుణాలకు ప్రాసెసింగ్ ఫీజ్ తగ్గింపు అమలవుతుంది. బ్యాంకులో కొత్తగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ప్రారంభిస్తే, రూ.250 వోచర్ కూడా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోళ్లకు ఈ వోచర్‌ను వినియోగిచుకోవచ్చు. ఇక యాక్సిస్ బ్యాంక్ 6.90 శాతానికి గృహ రుణ రేటును ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment