న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు వస్తున్న కంపెనీలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కఠినంగా వ్యవహరిస్తోంది. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ ఐపీవో తదుపరి తలెత్తిన సవాళ్లరీత్యా అన్‌లిస్టెడ్ కంపెనీలు అందిస్తున్న సమాచారంపై మరింత ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి గత రెండు నెలల్లో ఆరు కంపెనీల ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను తిప్పి పంపింది. ఓయో బ్రాండుతో ఆతిథ్య రంగ సేవలందిస్తున్న ఒరావెల్ స్టేస్ ఈ జాబితాలో చోటు చేసుకోవడం గమనార్హం! మరింత లోతైన సమాచారంతో తిరిగి తాజా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేయమంటూ సెబీ ఆయా కంపెనీలను ఆదేశిస్తోంది.
జాబితాలో..:
ఓయోతోపాటు.. సెబీ ప్రాస్పెక్టస్‌లను వెనక్కి పంపిన జాబితాలో ఫెయిర్‌ఫాక్స్(కెనడా) గ్రూప్‌నకు పెట్టుబడులున్న గో డిజిట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, బీ2బీ పేమెంట్స్, సర్వీసుల సంస్థ పేమేట్ ఇండియా, మొబైల్ తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్, ఫైనాన్షియల్ సేవల సంస్థ ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా, సమీకృత సర్వీసుల సంస్థ బీవీజీ ఇండియా ఉన్నాయి. 2021 సెపె్టంబర్ - 2022 మే నెల మధ్యలో ఈ 6 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ ఏడాది జనవరి - మార్చి10 మధ్య సెబీ వీటి ప్రాస్పెక్టస్‌లను తిప్పి పంపింది. ఈ కంపెనీలు ఉమ్మడిగా రూ. 12,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేశాయి.
2021లో నష్టాల ఎఫెక్ట్...
2021లో కొన్ని బడా కంపెనీల పబ్లిక్ ఇష్యూల ద్వారా ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడంతో సెబీ ఇటీవల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైమ్‌డేటాబేస్ గణాంకాల ప్రకారం 2022లో సగటున సెబీ ఐపీవోలకు 115 రోజుల్లోగా అనుమతిని ఇచ్చింది.
కొత్తతరం డిజిటల్ కంపెనీలు పేటీఎమ్, జొమాటో, నైకా ఇష్యూలలో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడంతో సెబీ ఐపీవోకు అనుమతించడంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పరిరక్షణరీత్యా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని వ్యాఖ్యానించారు. అయితే పబ్లిక్ ఇష్యూలలో ఇన్వెస్ట్ చేసేటపుడు ఇన్వెస్టర్లు ప్రధానంగా అధిక ధరను ఆశిస్తున్న కంపెనీలకు దూరంగా ఉండాలని సూచించారు.
పేటీఎమ్ షాక్
పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ చెల్లింపుల సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ 16 నెలల క్రితం పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా తదుపరి అత్యధికంగా రూ. 18,300 కోట్లు సమీకరించి 2021 నవంబర్‌లో లిస్టయ్యింది. తదుపరి ఇష్యూ ధరలో 72 శాతాన్ని కోల్పోయింది. కాగా.. సెబీ ఇటీవలి చర్యలు నిబంధనల అమలులో మర్చంట్ బ్యాంకర్లకు హెచ్చరికలుగా భావించవచ్చని మూలా వ్యవస్థాపక సీఈవో ప్రకార్ పాండే అభిప్రాయపడ్డారు. మార్కెట్ల హెచ్చుతగ్గులు, ఇన్వెస్టర్ల బలహీన సెంటిమెంటు నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకూ 9 కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచీ డివ్‌జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్, గ్లోబల్ సర్ఫేసెస్ మాత్రమే పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా రూ. 730 కోట్లు సమీకరించాయి. రూ. 66 కోట్లు సమకూర్చుకునేందుకు ఉదయ్‌శివ్‌కుమార్ వచ్చే వారం ఐపీవోకు రానుంది.
2022లో ఓకే...
గతేడాది(2022) మొత్తం 38 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. తద్వారా రూ. 59,000 కోట్లు సమీకరించాయి. అయితే 2021లో రికార్డ్‌స్థాయిలో 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టాయి. రూ. 1.2 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. ఇక గతేడాది బీమా రంగ పీఎస్‌యూ ఎల్‌ఐసీ రూ. 20,557 కోట్లు సమీకరించడం ద్వారా స్టాక్ ఎక్స్చెంజీలలో లిస్టయ్యింది.
వెరసి 2022 ఐపీవో నిధుల్లో 35 శాతం వాటాను ఆక్రమించింది. ఈ ఇష్యూని మినహాయిస్తే ప్రైమరీ మార్కెట్ నీరసించినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్థిక మాంద్య భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు ప్రభావం చూపినట్లు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) ద్వితీయార్ధంలో ప్రైమరీ మార్కెట్ పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ధరలతోపాటు పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆర్థిక మందగమనం, షేర్ల అధిక విలువలు తదితర అంశాలు మార్కెట్లలో దిద్దుబాట్లకు కారణంకానున్నట్లు విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment