న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న ఆతిథ్య రంగ కంపెనీ ఓయో విలువ 8 బిలియన్ డాలర్ల నుంచి 6.5 బిలియన్ డాలర్లకు క్షీణించినట్లు తెలుస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడి విలువలో 20 శాతంమేర కోత పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఓయోలో పెట్టుబడుల విలువను 2.7 బిలియన్ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలియజేశాయి.
గతేడాది ప్రయివేట్ మార్కెట్లలో 8 బిలియన్ డాలర్ల స్థాయిలో లావాదేవీలు జరగ్గా.. ఇటీవల 6.5 బిలియన్ డాలర్ల విలువలో నమోదౌతున్నట్లు వివరించాయి. ఈ ప్రభావంతో సెప్టెంబర్ 30తో ముగిసిన వారంలో 12.3 లక్షల ఓయో షేర్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. అంతక్రితం వారం 1.6 లక్షల షేర్లు మాత్రమే చేతులు మారాయి. కాగా.. నష్టాలను తగ్గించుకుంటూ నిర్వహణా లాభాలు ఆర్జించినట్లు ఫైనాన్షియల్స్‌పై గత నెలలో ఓయో ప్రాస్పెక్టస్‌ను ఆప్‌డేట్ చేసింది. దీంతో షేరు ప్రయివేట్ మార్కెట్‌లో రూ. 94ను తాకింది. తాజాగా ఈ విలువ రూ. 81కు క్షీణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఓయో రూ. 8,430 కోట్ల సమీకరణకు వీలుగా గతేడాది అక్టోబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తదుపరి 2022 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,459 కోట్ల ఆదాయాన్ని, సర్దుబాటు తదుపరి రూ. 7.3 కోట్ల ఇబిటాను ఆర్జించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment