స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవారికి ఇప్పటి వరకు టి+1 రోజున అంటే ట్రేడ్ చేసిన మరుసటి రోజున సెటిల్‌మెంట్ జరుగుతోంది. అయితే తాజాగా సెబీ నిబంధనలు మారుస్తున్నట్లు ప్రకటించింది. దాంతో టి+0తో ట్రేడ్ జరిగిన రోజే షేర్ల సెటిల్‌మెంట్ పూర్తవుతుంది.
ప్రస్తుతానికి సెబీ ఈ సెటిల్‌మెంట్‌పై నమూనా పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 28, 2024 నుంచి బీటా వర్షన్‌ను ఆవిష్కరించనుంది. టి+0 సెటిల్‌మెంట్‌ను కేవలం 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. తద్వారా వ్యవస్థ సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు. అన్ని షేర్లకు ఒకే రోజు సెటిల్‌మెంట్‌ను అమలు చేయడానికి ముందు ఈ 25 షేర్లపై జరిపే పరీక్షా ఫలితాలను బట్టి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు.
మూడు, ఆరు నెలల కాలంపాటు ఈ పరీక్షల ప్రగతిని సెబీ పరీక్షించనుంది. అన్ని సజావుగా జరిగితే విస్తృత స్థాయిలో టి+0 అమల్లోకి వస్తుంది. బీటా వర్షన్ వినియోగదార్లతో పాటు అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం పూర్తిస్థాయిలో అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి రానుంది.
ఏమిటి ప్రయోజనం..
టి+0 సెటిల్‌మెంట్ వల్ల బ్రోకర్ల సొంత నిధులను వాడాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. తద్వారా మొత్తం మీద వ్యాపార వ్యయాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఎవరైనా క్లయింటు షేర్లను విక్రయిస్తే తక్షణం అందుకు సంబంధించిన మొత్తం ట్రేడింగ్ ఖాతాలో పడిపోతోంది. ఆ మొత్తంతో షేర్ల కొనుగోళ్లు చేయడానికి వీలవుతుంది. తక్షణ సెటిల్‌మెంట్ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది.
ఇదీ చదవండి: భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు
గతంలో 2002 వరకు టి+5 సెటిల్‌మెంట్ విధానం అమలులో ఉండేది. దాన్ని ఏప్రిల్ 2002లో టి+3కి సెబీ మర్చింది. ఆ తర్వాతి సంవత్సరమే టి+2కు సవరించింది. 2021లో టి+1ను దశలవారీగా అమలు చేయడం ప్రారంభించింది. తుది దశను జనవరి 2023కు పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment