న్యూఢిల్లీ: కనిష్ట స్థాయిల వద్ద మెటల్, ఫైనాన్స్, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. సెనెక్స్ 255 పాయింట్లు పెరిగి 39,983 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,762 వద్ద స్థిరపడ్డాయి. మునుపటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు దిగివచ్చాయి. అలాగే ధరలు గరిష్టస్థాయిల నుంచి కనిష్టాలకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావించిన ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. అయితే ఐటీ, మీడియా షేర్లు మాత్రం స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లకుగానూ 24 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఐఐలు, డీఐఐలు ఇరువురూ శుక్రవారం నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఎఫ్‌ఐఐలు రూ.479 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.430 కోట్ల షేర్లను విక్రయించారు. ఈ వారంలో సెనెక్స్ 526.51 పాయింట్లు(1.29 శాతం), నిఫ్టీ 157.75 పాయింట్లను కోల్పోయాయి. రెండోదశ కరోనా కేసుల విజృంభణతో అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వైఖరి నెలకొని ఉంది.
మెరిసిన మెటల్ షేర్లు–ఐటీలో అమ్మకాలు...
కొన్ని రోజులుగా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్న మెటల్ షేర్లలో శుక్రవారం అనూహ్య ర్యాలీ చోటుచేసుకుంది. టాటా స్టీల్ (5.5 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (6.7 శాతం) షేర్ల అండతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం లాభంతో ముగిసింది. అయితే ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగడంతో ఈ రంగ షేర్లు ఆరంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్‌తో పాటు బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్స్ షేర్లలో ర్యాలీ కూడా బెంచ్‌మార్క్ సూచీలకు కలిసొచ్చింది. ఒక దశలో సెన్సెక్స్ 398 పాయింట్లు పెరిగి 40,126 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు లాభపడి 11,790 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
‘నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌లో 11,500 వద్ద బలమైన మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. రెండో త్రైమాసిక ఫలితాలు, ఉద్దీపన ప్యాకేజీ ప్రణాళికల వార్తలు రానున్న రోజుల్లో మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. ఐటీ, టెలికం, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లోని సానుకూలతల దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ షేర్లు రాణించే అవకాశం ఉంది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
‘నిఫ్టీలో కన్సాలిడేషన్ జరిగేందుకు అవకాశం ఉన్నట్లు సంకేతాలు సూచిస్తున్నాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని., ఇరువైపుల పొజిషన్లను మెయిన్‌టైన్ చేసుకోవాలని మా కస్టమర్లకు సలహానిస్తున్నాము’ అని రెలిగేర్ బ్రోకింగ్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు.
► హెచ్‌సీఎల్ టెక్ షేరు 3% క్షీణించింది.
► క్యూ2 ఆదాయ వృద్ధి మందగించడంతో మైండ్ ట్రీ షేరు 7 శాతం నష్టాన్ని చవిచూసింది.
► అనుబంధ సంస్థ ఆడిటర్ రాజీనామా తో యూపీఎల్ షేరు 8% క్షీణించింది.
► ఎన్‌ఎస్‌ఈలో 89 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి.
కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు
Published Sat, Oct 17 2020 5:28 AM | Last Updated on Sat, Oct 17 2020 5:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment