
ముంబై: వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దౌడు తీస్తున్నాయి. వెరసి స్టాక్ మార్కెట్ల చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 43,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం 418 పాయింట్లు జంప్ చేసి 43,015 వద్ద ట్రేడవుతోంది. సోమవారం సైతం ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ సరికొత్త రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా ఫలితాలనిచ్చినట్లు పేర్కొనడంతో ఫైజర్ లిమిటెడ్ కౌంటర్ జోరందుకుంది. అమెరికన్ పేరెంట్ కంపెనీ ఫైజర్ ఇంక్ షేరు సోమవారం 7.5 శాతం లాభపడటంతో ఈ కౌంటర్ కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు.
20 శాతం ప్లస్
జర్మన్ కంపెనీ బయో ఎన్టెక్ తో సంయుక్తంగా రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు ఫైజర్ ఇంక్ పేర్కొంది. ఈ నెలాఖరుకల్లా ఎమెర్జీన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించే వీలున్నట్లు అభిప్రాయపడింది. దీంతో దేశీ అనుబంధ సంస్థ ఫైజర్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్ఎస్ఈలో తొలుత 20 శాతం దూసుకెళ్లింది. రూ. 977 ఎగసి రూ. 5,900ను తాకింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుుకుంది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 5,256 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment