
ముంబై, సాక్షి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టినట్లు ఆర్‌బీఐ తాజాగా అభిప్రాయపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒక్కసారిగా సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు జంప్‌చేసింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 45,000 పాయింట్లను అధిగమించింది. 45,023కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 100 పాయింట్లకుపైగా ఎగసింది. 13,248ను దాటింది. తద్వారా ఇంట్రాడేలో సరికొత్త గరిష్టానికి చేరుకుంది. ఈ ఏడాది క్యూ3లో జీడీపీ 5.6 శాతం క్షీణతను చవిచూడనుందన్న అంచనాలను తాజాగా 0.1 శాతం వృద్ధిగా ఆర్‌బీఐ సవరించడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మొదట్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు.
లాభాల్లో
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, మెటల్, ఆటో, బ్యాంకింగ్ 2-1 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, హిందాల్కో, గ్రాసిమ్, ఎయిర్‌టెల్, గెయిల్, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ 5-1.6 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో ఆర్‌ఐఎల్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment