మళ్లీ అమ్మకాలదే పైచేయి | Sensex ends 638 pts lower, Nifty sheds 216 | Sakshi
Sakshi News home page

మళ్లీ అమ్మకాలదే పైచేయి

Published Tue, Oct 4 2022 6:53 AM | Last Updated on Tue, Oct 4 2022 7:01 AM

Sensex ends 638 pts lower, Nifty sheds 216 - Sakshi

ముంబై: గత వారం చివర్లో ఒక్కసారిగా జోరందుకున్న స్టాక్‌ ఇండెక్సులు తిరిగి తోకముడిచాయి. ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలకే మొగ్గుచూపడంతో నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 638 పాయింట్లు పతనమై 56,789 వద్దకు చేరగా.. 207 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 16,887 వద్ద స్థిరపడింది.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆర్థిక మాంద్య ఆందోళనలు సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణ అదుపునకు వడ్డీ రేట్ల పెంపును చేపడుతుండటం స్టాక్స్‌లో అమ్మకాలకు దారితీస్తున్నట్లు తెలియజేశారు. రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు, ట్రెజరీ ఈల్డ్స్‌ జోరు సైతం ఇందుకు కారణమవుతున్నట్లు వివరించారు. 

ఫార్మా ఎదురీత: ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా (1.1%) మినహా అన్ని రంగాలూ నీరసించాయి. ప్రధానంగా మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్‌ 3–1.6 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్, ఐషర్, అదానీ పోర్ట్స్, టాటా కన్జూమర్, మారుతీ, హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్, హిందాల్కో, బజాజ్‌ ఫైనాన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 8.4–2.2% మధ్య పతనమయ్యాయి. అయితే ఓఎన్‌జీసీ 4.6% జంప్‌చేయగా.. డాక్టర్‌ రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్, కోల్‌ ఇండియా 2–1% మధ్య బలపడ్డాయి.   

మిడ్‌ క్యాప్స్‌ వీక్‌ 
మార్కెట్ల బాటలో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 1.2–0.5 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,194 నష్టపోగా 1,356 మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తాజాగా అమ్మకాల బాట వీడీ రూ. 591 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 423 కోట్ల స్టాక్స్‌ విక్రయించాయి.

ఎల్‌ఐసీ పెట్టుబడి: ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఇటీవల కొద్ది రోజులుగా పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ మొత్తం 33.86 లక్షలకుపైగా షేర్లను కొనుగోలు చేసినట్లు  డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ పేర్కొంది. దీంతో కంపెనీలో ఎల్‌ఐసీ వాటా తాజాగా 7.7 శాతానికి బలపడినట్లు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement