ముంబై: ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలకు తగ్గట్టు ఎన్నికల ఫలితాలు బీజేపీకే అనుకూలంగా వెలువడటంతో స్టాక్ మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ భయాలు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు దిగిరావడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటం తదితర అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 817 పాయింట్లు పెరిగి 55,464 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 250 పాయింట్లు ఎగసి 16,595 వద్ద నిలిచింది. రూపాయి ర్యాలీతో ఐటీ షేర్లకు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ సూచీలో టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. ‘‘అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
దీంతో కేంద్రం తలపెట్టదలిచిన ఆర్థిక సంస్కరణల వేగం మరింత పుంజుకోవచ్చని ఇన్వెస్టర్లు భావించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ సంధికి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టర్కీలో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇరాక్, యూఏఈలతో పాటు ఒపెక్ దేశాల నుంచి అదనపు చమురు అందుబాటులోకి వస్తుందనే వార్తలతో క్రూడ్ ధరలు చల్లబడ్డాయి. ఇప్పుడు సాంకేతికంగా నిఫ్టీ 16,800 స్థాయి వద్ద నిరోధాన్ని కలిగి ఉంది. బలమైన ఈ స్థాయిని ఛేదిస్తేనే మార్కెట్ మూమెంటమ్ కొనసాగుతుంది’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 19 పైసలు బలపడి 76.43 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,981 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.946 కోట్ల షేర్లను కొన్నారు.
దాదాపు సగం లాభాలు మాయం
ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 1,595 పాయింట్ల లాభంతో 56,242 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు పెరిగి 16,757 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వెలువడుతుండటంతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోగలిగాయి. అయితే యూరప్ యూనియన్ బ్యాంక్ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం, యూఎస్ సీపీఐ డేటా గణాంకాల వెల్లడి నేపథ్యంలో యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్వెస్టర్లు మిడ్‌సెషన్ నుంచి లాభాల స్వీకరణకు పూనుకోవడంతో సూచీలు సగం లాభాలు మాయమయ్యాయి.
మూడు రోజుల్లో రూ.10.83 లక్షల కోట్లు
మూడు ట్రేడింగ్ సెషన్‌లలో సెన్సెక్స్ 2,621 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల
మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్ క్యాప్) రూ.10.83 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా బీఎస్‌ఈ ఎక్సే్చంజీ మార్కెట్ క్యాప్ రూ.251 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► ట్రేడింగ్ సమయంలో రూ.2,689 కోట్ల షేర్లు చేతులు మారడంతో కోపోర్జ్ షేరు ఏడు శాతం క్షీణించి రూ.4,234 వద్ద స్థిరపడింది.
► పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంక్(ఎస్‌ఎఫ్‌బీ)లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంటుందనే వార్తలతో పేటీఎం షేరు మూడుశాతం పెరిగి రూ.774 వద్ద నిలిచింది. గత రెండురోజుల్లో ఈ షేరు 9% ర్యాలీ చేసింది.
► క్రూడ్ ధరలు తగ్గడంతో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు వరుసగా అరశాతం, 3% చొప్పున బలపడ్డాయి.
► ఎఫ్‌ఎంసీజీ షేర్లకు నెలకొన్న డిమాండ్‌తో హెచ్‌యూఎల్ షేరు ఐదు శాతం బలపడి రూ.2,101 వద్ద ముగిసింది. సూచీల్లో అత్యధికంగా బలపడిన షేరు ఇదే.
(చదవండి: బంగారం కొనేవారికి అదిరిపోయే శుభవార్త..!)
Comments
Please login to add a commentAdd a comment