స్టాక్ మార్కెట్ నష్టాలు శుక్రవారం కూడా కొనసాగాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ మరింత ఆలస్యం కానుండటం, సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్) బకాయిల విషయమై సుప్రీం కోర్ట్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న అనిశ్చితి, బ్యాంక్, ఆర్థిక, వినియోగ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్ పతనమైంది. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం 6.93%కి చేరడంతో రేట్ల కోత ఆశలు ఆవిరి కావడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు క్షీణించి 74.90కు చేరడం, వాహన కంపెనీల క్యూ1 ఫలితాలు నిరాశపరచడం, అమెరికా–చైనాల మధ్య చర్చల విషయమై అనిశ్చితి నెలకొనడం..... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 433 పాయింట్లు పతనమై 37,877 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 11.178 పాయింట్ల వద్ద ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 163 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయాయి.
866 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్.....
ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణి లాభాల్లో కదలాడింది. మధ్యాహ్నం గం.2 తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 231 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ మరో దశలో 655 పాయింట్ల మేర నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 886 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. చైనాలో పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు గణాంకాలు నిరాశపరిచాయి. దీంతో అంతర్జాతీయంగా రికవరీపై అనిశ్చితి నెలకొనడంతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 3 శాతం నష్టంతో రూ.610 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, ఇన్ఫోసిస్‌లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి.
► ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.55 కోట్ల నష్టాలు రావడంతో ఐషర్ మోటార్స్ షేర్ 7 శాతం నష్టంతో రూ.20,130 వద్ద ముగిసింది.
► దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. మైండ్‌ట్రీ,లుపిన్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► మొత్తం 230 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. యస్ బ్యాంక్, లెమన్ ట్రీ హోటల్స్, అలోక్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment