
ముంబై: ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ దిగ్గజాలలో అమ్మకాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 537 పాయింట్లు పతనమై 56,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 162 పాయింట్లు క్షీణించి 17,038 వద్ద ముగిసింది. యూఎస్ మార్కెట్ల క్షీణత, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ వేడి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు తదితర ప్రతికూల అంశా లు సెంటిమెంటును బలహీనపరచినట్లు స్టాక్ విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో తొలి నుంచీ ఇన్వెస్ట ర్లు, ట్రేడర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 773 పాయింట్లు పతనమై 56,584ను తాకింది. నిఫ్టీ సైతం 242 పాయింట్లు కోల్పోయి 17,000 దిగువన 16,958కు చేరింది.
బజాజ్ ఫైనాన్స్ వీక్
సెన్సెక్స్, నిఫ్టీ దిగ్గజాలలో భాగమైన బజాజ్ ఫైనాన్స్ 7.25 శాతం పతనంకాగా.. గ్రూప్‌లోని మరో కంపెనీ బజాజ్ ఫిన్‌సర్వ్ 4 శాతం క్షీణించింది. దీంతో బజాజ్ ఫైనాన్స్ షేరు రూ. 6,717 వద్ద ముగిసింది. మార్కెట్ విలువలో రూ. 31,727 కోట్లమేర కోత పడింది. రూ. 4,06,646 కోట్లకు పరిమితమైంది. అయితే క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 2,420 కోట్ల నికర లాభం ఆర్జించడం గమనార్హం! కాగా.. ఇతర దిగ్గజాలలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ 2.2–1.8 శాతం మధ్య నీరసించాయి. ఐటీ బ్లూచిప్స్‌లో విప్రో, ఇన్ఫోసిస్ దాదాపు 2 శాతం వెనకడుగు వేయగా.. టైటన్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్‌ఎం, మారుతీ 2.2–1.5 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టాటా స్టీల్ 1 శాతం బలపడగా.. ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, కొటక్ బ్యాంక్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బలపడటంతో మార్కెట్లు కొంతమేర నష్టాలను తగ్గించుకున్నాయి.
కన్సాలిడేషన్ దశ
ప్రస్తుతం నడుస్తున్న కన్సాలిడేషన్ దశలో భాగంగా మార్కెట్లు వెనకడుగు వేసినట్లు రెలిగేర్ బ్రోకింగ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లకుతోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు, కంపెనీల ఫలితాలు మార్కెట్లలో ఒడిదొడుకులకు కారణమవుతున్నట్లు తెలియజేశారు.
హెచ్చుతగ్గులు..
గ్లోబల్ మార్కెట్లలో భారీ అమ్మకాల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు సైతం హెచ్చుతగ్గులు చవిచూస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ముదురుతున్న ఇంధన సంక్షోభం, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీన ఔట్‌లుక్, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఇటీవల కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతుండటంతో ప్రపంచ ఆర్థిక మందగమనానికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చైనాలో అమలవుతున్న లాక్‌డౌన్‌లు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు సైతం ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు వివరించారు. దీంతో ఈక్విటీ ఫండ్స్ నుంచి పెట్టుబడులు రక్షణాత్మక అవకాశాలవైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు.
చిన్న షేర్లు డీలా
బీఎస్‌ఈలో ప్రధానంగా విద్యుత్, యుటిలిటీస్, టెలికం, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 2–1.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే మెటల్ నామమాత్రంగా నిలదొక్కుకుంది. ఇక మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ అమ్మకాలు పెరగడంతో బీఎస్‌ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.9–0.6 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,202 క్షీణించగా.. 1,161 బలపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,065 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,918 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment