
నేడు (27న) దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 29 పాయింట్లు పుంజుకుని 11,809 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 11,780 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, ఆర్థిక వృద్ధికి దన్నుగా ప్యాకేజీ ప్రకటించే అంశంపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో సోమవారం యూఎస్ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో నష్టపోయాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం నీరసంగా కదులుతున్నాయి. దేశీయంగా ముందురోజు భారీ అమ్మకాలు నమోదుకావడంతో నేడు తొలుత మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్‌కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గురువారం ఎఫ్‌అండ్‌వో ముగింపు కారణంగా మిడ్‌సెషన్ నుంచీ హెచ్చుతగ్గులు నమోదుకావచ్చని అంచనా వేశారు.
మార్కెట్లు బేర్
తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సోమవారం దేశీ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 540 పాయింట్లు కోల్పోయి 40,145 వద్ద ముగిసింది. నిఫ్టీ 162 పాయింట్లకు నీళ్లొదులుకుని 11,768 వద్ద నిలిచింది. మిడ్‌సెషన్‌కల్లా అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ 40,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. 39,948ను తాకింది. ట్రేడింగ్ ప్రారంభంలో సాధించిన 40,724 పాయింట్లే ఇంట్రాడే గరిష్టంకాగా.. నిఫ్టీ సైతం ఒక దశలో 11,712 పాయింట్ల దిగువకు చేరింది. తొలుత 11,943 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టం నమోదైంది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,672 పాయింట్ల వద్ద, తదుపరి 11,576 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,903 పాయింట్ల వద్ద, ఆపై 12,039 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,770 పాయింట్ల వద్ద, తదుపరి 23,464 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,479 పాయింట్ల వద్ద, తదుపరి 24,883 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.
అమ్మకాలవైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 119.4 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 907 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 892 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే.