ముంబై, సాక్షి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టినట్లు ఆర్‌బీఐ వేసిన అంచనాలు, జనవరికల్లా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో మరోసారి లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 45,215కు చేరింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు ఎగసి 13,300 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్ 45,245 వద్ద, నిఫ్టీ 13,312 వద్ద ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను తాకడం విశేషం!
ఫార్మా మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ 1.4-1 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్, గెయిల్, యూపీఎల్, ఐటీసీ, ఐవోసీ, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్, కోల్ ఇండియా 3.25-1.6 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటన్, దివీస్ ల్యాబ్, టీసీఎస్, కొటక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, హిందాల్కో 1.3- 0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
ఫైనాన్స్ జోష్
డెరివేటివ్స్‌లో శ్రీరామ్ ట్రాన్స్, టాటా కెమికల్స్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ లంబార్డ్, వేదాంతా, నాల్కో 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎస్కార్ట్స్, టొరంట్ ఫార్మా, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఐడియా, బయోకాన్, బాలకృష్ణ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,576 లాభపడగా.. 538 నష్టాలతో ట్రేడవుతున్నాయి.
ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment