
ముందు రోజు నష్టాల నుంచి నేడు (21న) దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.10 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 90 పాయింట్లు బలపడి 11,384 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,294 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాల దన్నుతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఈ ప్రభావంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ మార్కెట్లు తొలి సెషన్‌లో సానుకూలంగా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆపై కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఫెడ్ వ్యాఖ్యలతో..
కోవిడ్-19 కల్లోలానికి ఆర్థిక రికవరీ అనిశ్చితిలో పడినట్లు యూఎస్ ఫెడ్ స్పష్టం చేయడంతో గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 394 పాయింట్లు పతనమై 38,220 వద్ద ముగిసింది. నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 11,312 వద్ద నిలిచింది. ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకే కట్టుబడటంతో నిఫ్టీ తొలుత 11,290 వరకూ జారింది. తదుపరి 11,361 వరకూ కోలుకుంది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,281 పాయింట్ల వద్ద, తదుపరి 11,250 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,352 పాయింట్ల వద్ద, ఆపై 11,393 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,897 పాయింట్ల వద్ద, తదుపరి 21,795 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,092 పాయింట్ల వద్ద, తదుపరి 22,182 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
అమ్మకాలవైపు..
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 268 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 672 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 459 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 97 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.