
నేడు(22న) దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 52 పాయింట్లు ఎగసి 11,278 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,226 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్యాకేజీపై ప్రతిష్టంభన, బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలపై ఆరోపణల నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు సోమవారం యూఎస్ మార్కెట్లు 2-0.25 శాతం మధ్య డీలాపడ్డాయి. యూరోపియన్ దేశాలలో లాక్‌డవున్‌ల నేపథ్యంలో ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. గురువారం సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనున్న కారణంగా దేశీ మార్కెట్లు నేడు ఆటుపోట్ల మధ్య ట్రేడ్‌కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
812 పాయింట్లు డౌన్
ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. వెరసి గత ఆరు నెలల్లోలేని విధంగా మార్కెట్లు బోర్లా పడ్డాయి.సెన్సెక్స్ 812 పాయింట్లు పడిపోయి 38,034 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 255 పాయింట్లు పతనమై 11,250 వద్ద నిలిచింది. మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు పెరగడంతో 38,991 పాయింట్ల గరిష్టం నుంచి సెన్సెక్స్ ఒక దశలో 37,946 వరకూ జారింది. ఇక నిఫ్టీ 11,535- 11,219 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,134 పాయింట్ల వద్ద, తదుపరి 11,018 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,451 పాయింట్ల వద్ద, ఆపై 11,651 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,061 పాయింట్ల వద్ద, తదుపరి 20,755 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,886 పాయింట్ల వద్ద, తదుపరి 22,404 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
అమ్మకాలవైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 540 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 205 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment