ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ను శాసించే అంశాలు ఇవేనా?! | Some Things That Will Decide Stock Market Action On Monday | Sakshi
Sakshi News home page

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ను శాసించే అంశాలు ఇవేనా?!

Published Mon, Jul 5 2021 12:27 AM | Last Updated on Mon, Jul 5 2021 12:29 AM

Some Things That Will Decide Stock Market Action On Monday - Sakshi

ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ అంశాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ను నడిపిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ గురువారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికపు ఫలితాల ప్రకటనతో దేశీయ కార్పొరేట్‌ రంగంలో ఫలితాల సందడి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ కంపెనీల క్యూ1 ఆదాయ గణాంకాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయి. కోవిడ్‌ కేసులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రి య అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. రూపాయి ట్రేడింగ్, క్రూడాయిల్‌ కదలికలు, విదేశీ పెట్టుబడులు వంటి సాధారణ అంశాలూ మార్కెట్‌ గమనా న్ని నిర్ధేశించగలవు. గతవారంలో సెన్సెక్స్‌ 440 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 138 పాయింట్లు నష్టపోయింది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నిరాశపరచడంతో పాటు పలు దేశాల్లో కోవిడ్‌ కేసులు తిరిగి పెరగడం సూచీల పతనానికి కారణమయ్యాయి. అయినప్పటికీ చిన్న, మధ్య తరహా షేర్లు రాణించడంతో అదే వారంలో నిఫ్టీ 15,915 స్థాయిల వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. 

‘‘టీసీఎస్‌ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఈ వారంలో లార్జ్, మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవ్వొచ్చు. ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం వంటి సానుకూలతలతో కార్పొరేట్‌ కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించవచ్చు. అయితే గణాంకాలు నిరాశపరిస్తే మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపడొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది’’ సామ్కో సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ నిపుణుడు నిరాలి షా తెలిపారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే..,
  
స్థూల ఆర్థిక గణాంకాలు...  

జూన్‌ నెలకు చెందిన దేశీయ సేవా రంగపు గణాంకాలు నేడు(సోమవారం) విడుదల అవుతాయి. లాక్‌డౌన్‌ నిబంధల సడలింపుతో జూన్‌లో సేవా రంగం ఊపందుకుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గణాంకాలు అంచనాలను అందుకోలేకపోతే మార్కెట్లో అమ్మకాలు జరగవచ్చు. గత వారంలో వెల్లడైన తయారీ రంగ గణాంకాలు నిరాశపరిచిన నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్‌ వర్గాలు సేవా రంగం లెక్కలపై దృష్టి సారించాయి.
 
అంతర్జాతీయ పరిణామాలు...  
అమెరికా శుక్రవారం ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది. అంచనాలకు మించి జూన్‌లో ఉద్యోగ కల్పన జరిగింది. అంతర్జాతీయంగా కోవిడ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఈ అంశాలు ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చేవిగా ఉన్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ ఈ బుధవారం వెల్లడి కానున్నాయి. భారత్‌ లాంటి వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపగల క్రూడాయిల్‌ ఉత్పత్తిపై ఒపెక్‌ ప్లస్‌ దేశాలు కీలక నిర్ణయాన్ని తీసుకొనున్నాయి.
   
క్యూ1 ఆర్థిక ఫలితాలు ప్రకటన ప్రారంభం 
ఈ వారం నుంచి కంపెనీల ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు విడుదల అవుతాయి. జూలై ఎనిమిదో తేదీన టీసీఎస్‌ ప్రకటించనున్న క్యూ1 ఆర్థిక ఫలితాలను మార్కెట్‌ నిశితంగా పరిశీలించనుంది. ఇదే వారంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్, డెల్టా కార్ప్, శ్యామ్‌ మెటాలిక్స్‌ అండ్‌ ఎనర్జీ, ఇంటిగ్రేటెడ్‌ క్యాపిటల్‌ సర్వీసెస్, పీటీసీ ఇండస్ట్రీస్, క్వాలిటీ మొదలగు కంపెనీలు తమ క్వార్టర్‌ ఫలితాలను విడుదల చేయనున్నాయి. త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటే మార్కెట్‌ సాఫీగా ముందుకు కదలవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

ఇండియా పెస్టిఫైడ్స్‌ లిస్టింగ్‌ నేడే...  
ఆగ్రో కెమికల్‌ రంగానికి చెందిన ఇండియా పెస్టిఫైడ్స్‌ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ కంపెనీ జూన్‌ 25–27 తేదీల మధ్య ఐపీఓను పూర్తి చేసుకుంది. ఇష్యూ 29 రెట్లు సబ్‌స్క్రైడ్‌ అయ్యింది. కంపెనీ 1.93 కోట్ల షేర్ల జారీ చేయగా 56.07 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. షేరుకు రూ.290 – 296 ధరల శ్రేణిని నిర్ణయించారు. గ్రే మార్కెట్లో ఈ స్టాక్‌కు రూ.50ల వరకూ ప్రీమియం పలుకుతోంది. రూ.340–350 మధ్య షేర్లు లిస్ట్‌ అయ్యే సూచనలున్నాయి.
  
రెండు నెలల తర్వాత ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు...  
భారత మార్కెట్లో రెండు నెలల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు ఈ జూన్‌లో రూ.13,269 కోట్ల విలువైన షేర్లను కొన్నట్లు ఎక్సే్చంజ్‌ గణాంకాలు తెలిపాయి. అయితే గత వారంలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. కేవలం రూ.195.5 కోట్ల షేర్లను మాత్రమే కొన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement