
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులకు వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ట్రావెల్ యూనియన్ పేరిట బిజినెస్–టు–బిజినెస్ ట్రావెల్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించారు. ఐఆర్‌సీటీసీ దేశవ్యాప్తంగా నిర్వహించే రైళ్లు, దేశ..విదేశ రూట్లలో 500 పైచిలుకు ఫ్లయిట్లు, 10 వేల పైచిలుకు బస్సు ఆపరేటర్ల వాహనాల్లో టికెట్లతో పాటు హోటళ్లలో గదులను దీని ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకునే వెసులుబాటు అంతగా లేదని, ఒక్కో దానికోసం ఒక్కో ఆపరేటరును ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్రావెల్ యూనియన్‌తో ఇలాంటి వాటన్నింటినీ చౌకగా ఒకే చోట పొందవచ్చని సోను సూద్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారవేత్తలకు ఇది అదనపు ఆదాయ మార్గంగా ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫాంలో చేరడానికి కట్టే నామమాత్రపు రుసుము రిఫండ్ అవుతుందని, తద్వారా ఉచితంగానే చేరినట్లవుతుందన్నారు. ట్రావెల్ యూనియన్‌లో సోనూ సూద్ రెండో అతి పెద్ద వాటాదారుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment