న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజి దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ.. ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీస్తోంది. ఫైనాన్షియల్ సర్వి సెస్ బిజినెస్‌ను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఆర్‌ఐఎల్ విడదీయనుంది.
తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌గా మార్పు చేయనుంది. దీనిలో భాగంగా ఆర్‌ఐఎల్ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ షేరుకూ ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరును కేటాయించనుంది. ఇందుకు రికార్డ్ డేట్ జూలై 20కాగా.. అదే రోజు కొత్తవిధానంలో ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్‌ను ఎన్‌ఎస్‌ఈ నిర్వహించనుంది. దీని ప్రకారం నిఫ్టీ ఇండెక్స్‌లో ఆర్‌ఐఎల్ కొనసాగనుంది.
19 ఇండెక్సులలో..: జియో ఫైనాన్షియల్‌ను తాత్కాలికంగా నిఫ్టీ–50లో కొనసాగించడంతోపాటు.. 19 ఇండెక్సులలో చోటు కల్పించనుంది. దీంతో జూలై 20 నుంచి కనీసం మూడు రోజులపాటు నిఫ్టీకి తాత్కాలికంగా 51 షేర్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. జియో ఫైనాన్షియల్ లిస్టయిన రోజు నుంచి మూడు రోజులు( ఖీ+3) పూర్తయ్యాక ఇండెక్సుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది.
ఇదంతా నిఫ్టీ ఇండెక్సుల కొత్త విధానం ప్రకారం ఎన్‌ఎస్‌ఈ చేపట్టనుంది. ఏప్రిల్‌లో ఎన్‌ఎస్‌ఈ ఇండైసెస్ లిమిటెడ్ కొన్ని సవరణల ద్వారా కొత్త విధానానికి తెరతీసింది. కంపెనీల విడదీతసహా కార్పొరేట్ చర్యలకు అనుగుణంగా తాజా విధానానికి రూపకల్పన చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. దీనిలో భాగంగా ఎన్‌ఎస్‌ఈ ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్‌ను నిర్వహిస్తే నిఫ్టీలో విడదీత కంపెనీకి చోటు కల్పించవచ్చు.
రికార్డ్ డేట్ ఎఫెక్ట్..
అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వి సెస్ విడదీతకు రికార్డ్ డేట్ జూలై 20 కాగా.. 19 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్ చేసిన వాటాదారులకు జియో ఫైనాన్షియల్ షేర్లు పొందేందుకు వీలుంటుంది. ఇక గురువారం (20న) ఎన్‌ఎస్‌ఈ రెగ్యులర్ ట్రేడింగ్ కంటే ముందుగా ప్రత్యేక ప్రీ–ఓపెన్ సెషన్‌ను నిర్వహిస్తోంది.
ఉదయం 9–10 మధ్య జియో ఫైనాన్షియల్ షేరు ధర నిర్ణయానికి ఇది సహకరించనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. దీనికి సంబంధించి బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ఇచ్చిన ఉదాహరణను చూద్దాం.. 19న (టీ–1) ఆర్‌ఐఎల్ ముగింపు ధర రూ. 2,800 అనుకుంటే.. 20న రూ. 2,600 ధర పలికిందనుకుందాం.. వెరసి జియో ఫైనాన్షియల్ షేరు ధరను రూ. 200గా పేర్కొనవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment