కోవిడ్ మహమ్మారి ఎటాక్ చేసినప్పటి నుంచి ఇంటి బయట కాలు పెట్టాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. వైరస్ భయంతో కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్తామంటే మనసు రావడం లేదు. చిన్న చిన్న సరదాలకు కూడా దూరం కావాల్సి వస్తోంది. ఇంటిల్లిపాది సినిమాకి వెళ్లి ఏళ్లు నెలలు దాటిన కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి వారి కోసమే ప్రైవేటుగా సినిమా చూసేందుకు వీలుగా ఫ్యామిలీ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో ఈ కొత్త రకం ఫ్యామిలీ థియేటర్ బిజినెస్ ఊపందుకుంటోంది.
అద్దెకు థియేటర్
కరోనా తెర మీదకు వచ్చిన తర్వాత వెండి తెర మీద సినిమాలు చూడటం చాలా అరుదైన విషయంగా మారింది. వందల మందితో కలిసి సినిమా చూడాలంటే భయపడే కుటుంబాల సంఖ్య పెరిగింది. వినోదం కోసం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులో ఉన్నా థియేటర్‌లో చూసిన ఫీల్ అయితే మిస్ అవుతున్నారు. ఇలాంటి వారి కోసం కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే సినిమా చూసేలా అత్యాధునిక సౌకర్యాలతో థియేటర్‌ను స్టార్ ట్రాక్ గ్రూప్ హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. థియేటర్‌ను అద్దెకు తీసుకుని నచ్చిన సినిమాను చూసేయోచ్చు.
మల్టీప్లెక్స్ స్థాయిలో
స్టార్‌ట్రాక్ గ్రూపు థియేటర్‌లో ఏడుగురు కుటుంబ సభ్యుల వరకు సినిమా చూసే వీలుంది. ఈ థియేటర్‌లో 142 ఇంచెస్ ఆధునిక స్క్రీన్, మెయిన్ స్ట్రీమ్ థియేటర్‌కి ఏ మాత్రం తీసిపోని ఆడియో సిస్టమ్‌తో పాటు రిక్లెయినర్ చైయిర్లు అందుబాటులో ఉన్నాయి. థియేటర్ ఇంటీరియర్ సైతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. థియేటర్ అనుభూతిని అందివ్వడంలో ఈ ఫ్యామిలీ థియేటర్ మల్టీప్లెక్స్‌కి ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందించారు.
కంటెంట్ మనదే
ఈ రెంటెండ్ థియేటర్‌లో ఫ్యామిలీ ఫంక‌్షన్ వీడియోలతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, హాట్‌స్టార్ తదితర ఓటీటీ కంటెంట్‌లపై వచ్చే సినిమాలను సైతం ఇక్కడ చూసే వీలుంది. ఈ రోజుల్లో చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ ఫీల్ కావాలనుకునే వారు ఈ రెంటెండ్ థియేటర్‌లో కరోనా భయాలు లేకుండా సినిమాలను ఆస్వాదించవచ్చు.
రోజుకి మూడు షోలు
ఈ ఫ్యామిలీ థియేటర్‌ను రోజుకు మూడు షోలకు అద్దెకు ఇస్తున్నారు. మార్నింగ్ , ఆఫ్టర్‌నూన్, ఈవెనింగ్ సమయాల్లో ఇందులో ఫ్యామిలీతో సినిమాను చూసేయోచ్చు. షో టైమింగ్, వారాన్ని బట్టి ఒక్కో షోకి కనిష్టంగా రూ. 1500ల నుంచి గరిష్టంగా రూ.1900ల వరకు రెంట్ తీసుకుంటారు. ప్రతీ షో తర్వాత థియేటర్ మొత్తాన్ని ఆధునిక పద్దతిలో శానిటైజ్ చేస్తున్నారు. ఈ గ్రూప్‌కి చెందిన వెబ్‌సైట్‌కి వెళ్లి ముందుగా షోని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ట్రెండ్‌కి తగ్గట్టుగా
హైదరాబాద్ నగరంలో ఒకప్పటి సంగీత్ థియేటర్ మొదలు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సంధ్య థియేటర్స్ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లను డిజైన్ చేయడంలో స్టార్ ట్రాక్ గ్రూపుకి మంచి రికార్డు ఉంది. ఈ గ్రూపు ఓనర్లు మూడు తరాలు నగరంలో దాదాపు 300ల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. బ్రిటీష్ జమానాలో ఇంజీనింగ్‌లో గోల్డ్ మెడల్ పొంది బీకే మూర్తితో ఈ పరంపర మొదలైంది. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా రూపొందిన ఫ్యామిలీ థియేటర్ సికింద్రాబాద్, సర్థార్‌పటేల్ రోడ్‌లోని పైగా హౌసింగ్ కాలనీలో ఉంది.
చదవండి: కింగ్‌డమ్ ఆఫ్ కిడ్స్.. హైదరాబాద్‌లో కొత్త స్టూడియో
Comments
Please login to add a commentAdd a comment