గువాహటి: ఇంధన రిటైల్ స్టార్టప్ సంస్థ ఇండో పెట్రోలియం మార్కెటింగ్ (ఐపీఎం) తొలి దశలో 100 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనుంది. అస్సాంతో మొదలుపెట్టి వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు జ్ఞాన్ ప్రకాశ్ శర్మ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అయిదు రిటైల్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభిస్తామని, మొదటిది జోర్హాట్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఔట్‌లెట్ల ఏర్పాటుకు అనువైన స్థల సమీకరణలో తోడ్పాటు అందించాల్సిందిగా జిల్లాల యంత్రాంగాలకు అస్సాం ప్రభుత్వం ఇప్పటికే సూచించినట్లు శర్మ వివరించారు. ప్రభుత్వ రంగ రిఫైనర్ల నుంచి కొనుగోలు చేయడం లేదా దిగుమతి చేసుకోవడం ద్వారా ఇంధనాలను సమకూర్చుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ నుమాలిగఢ్ రిఫైనరీస్‌తో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.
వచ్చే 2–3 ఏళ్లలో అస్సాం, నార్త్ పశి్చమ బెంగాల్‌లో 25 ఔట్‌లెట్స్ నెలకొల్పే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఒక్కో బంకులో దాదాపు 20 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగలదన్నారు. తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు వీలున్న ప్రాంతాల్లో సీఎన్‌జీ, బయోఇంధనాలను కూడా విక్రయిస్తామని తెలిపారు. అన్ని బంకుల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పాయింట్లు ఉంటాయని శర్మ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment