ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు రెండోరోజూ లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి ర్యాలీ, విదేశీ కొనుగోళ్లు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో మెటల్ షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ ఉదయం 238 పాయింట్ల లాభంతో 61,188 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.
ఇంట్రాడేలో 61,401 – 60,714 మధ్య కదలాడింది. చివరికి 235 పాయింట్లు పెరిగి 61,185 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 18,212 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 18,065 వద్ద కనిష్టాన్ని, 18,256 వద్ద గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి నిఫ్టీ 86 పాయింట్లు బలపడి 18,203 వద్ద నిలిచింది. వెరసి ఇరు సూచీలు పదినెలల గరిష్టంపై స్థిరపడ్డాయి. ఫార్మా, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1949 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.844 కోట్ల షేర్లను అమ్మారు. కేంద్ర బ్యాంకులు అంచనాల కంటే ముందుగానే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే ఆశలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా (నేడు)మంగళవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎక్ఛేంజీలు పనిచేయవు.
నెల గరిష్టానికి రూపాయి
దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం నెలరోజుల గరిష్టంపై ముగిసింది. డాలర్ మారకంలో సోమవారం ఒక్కరోజే 43 పైసలు బలపడి 81.92 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 82.14 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 82.32 వద్ద కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడుతుండటం, దేశీయ క్యాపిటల్ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు మళ్లీ పెరుగుతుండటం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి దోహదపడ్డాయని ఫారెక్స్ విశ్లేషకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment