
ముంబై: స్టాక్ మార్కెట్లో రికార్డు ర్యాలీ రెండోరోజూ కొనసాగింది. ఆర్థిక వృద్ధి ఆశలతో పాటు మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఫార్మా, రియల్టీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు రాణించడంతో శుక్రవారమూ సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డు స్థాయిలను లిఖించాయి. సెన్సెక్స్ 644 పాయింట్లు ఎగసి 55,488 వద్ద ఆల్‌టైం హై స్థాయిని అందుకుంది. చివరికి 593 పాయింట్ల లాభంతో 55,437 వద్ద ముగిసింది.
నిఫ్టీ ఇంట్రాడేలో 180 పాయింట్లు పెరిగి 16,544 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదుచేసింది. మార్కెట్ ముగిసేసరికి 165 పాయింట్ల లాభంతో 16,529 వద్ద స్థిరపడింది. నిఫ్టీకిది వరుసగా ఐదోరోజూ, సెన్సెక్స్‌కు రెండోరోజూ లాభాల ముగింపు. ఐటీ కంపెనీలు భారీ ఆర్డర్లను దక్కించుకున్న నేపథ్యంలో రెండింతల ఆదాయ వృద్ధి నమోదు కావచ్చనే అంచనాలు ఈ రంగ షేర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఇటీవల స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్న ఎఫ్‌ఎంసీజీ రంగ కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో 10 షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.818 కోట్ల షేర్లను.., దేశీ ఇన్వెస్టర్లు రూ.149 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఇంట్రాడే నష్టాలను పూడ్చుకొని 74.24 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1160 పాయింట్లు, నిఫ్టీ 291 పాయింట్లను ఆర్జించాయి.
ఆద్యంతం కొనుగోళ్లే...
ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ... ఉదయం మన మార్కెట్ స్థిరంగా మొదలైంది. సెన్సెక్స్ 68 పాయింట్ల లాభంతో 54,912 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 16,386 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ తొలిసారి 55,000 స్థాయిని, నిఫ్టీ 16,500 మార్కును అధిగమించాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్లు లాభాల ప్రారంభంతో సూచీలు మరింత పరుగులు పెట్టాయి. మార్కెట్ ముగిసే వరకు ఏ దశలో కొనుగోళ్ల జోరు తగ్గకపోవడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులో కొత్త రికార్డులను నమోదు చేశాయి.
రెండురోజుల్లో రూ.3.48 లక్షల కోట్లు
సూచీల రికార్డు ర్యాలీ కొనసాగడంతో స్టాక్ మార్కెట్లో రెండోరోజుల్లోనే రూ.3.48 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.240 లక్షల కోట్లకు చేరింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
►ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ షేరు బీఎస్‌ఈలో 3%పైగా లాభపడి రూ.3,462 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నాలుగుశాతం ర్యాలీ చేసి రూ.3,479 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ.13 లక్షల కోట్లకు చేరింది.
►ఐఆర్‌సీటీసీ షేరులో లాభాల స్వీకరణ కొనసాగింది. బీఎస్‌ఈలో ఒకశాతం నష్టపోయి రూ.2,661 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment