ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడం ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య ఇస్తాంబుల్ వేదికగా జరిగిన శాంతి చర్చల్లో పురోగతి చోటుచేసుకుంది. ఫలితంగా ఆర్థిక, ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ, కన్జూమర్, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 57,944 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 103 పాయింట్లు బలపడి 17,325 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. కాగా ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఇంధన, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొనడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు అరశాతానికి పైగా రాణించాయి.
విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.35 కోట్ల షేర్లను, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,713 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 43 పైసలు బలపడింది. ఆసియాలో చైనా, ఇండోనేసియా మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభంతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు మూడున్నర శాతం దాకా దూసుకెళ్లాయి. అమెరికా ఫ్యూచర్లు ఒకటిశాతం లాభంతో కదలాడుతున్నాయి.
‘‘బాండ్లపై రాబడులను పరిమితం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ జపాన్ సరళతర ద్రవ్యపాలసీ విధానానికే మొగ్గుచూపడంతో ఆసియా మార్కెట్లు రాణించాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ విరమణ చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్నాయి. చైనాలో కోవిడ్ కేసుల కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో డిమాండ్ తగ్గుముఖం పట్టవచ్చనే అంచనాలు కలిసిరావడంతో క్రూడాయిల్ ధరలు దిగివచ్చాయి. ఈ అంశాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా...!
ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ స్టాక్ సూచీలు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 57,815 వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 17,297 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక దశలో దాదాపు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. అయితే మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో దేశీ మార్కెట్లో అస్థిరతలు తగ్గాయి. ట్రేడింగ్ ముగిసేవరకు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సెన్సెక్స్ 408 పాయింట్లు పెరిగి 58,002 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 17,344 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
►హీరో మోటోకార్ప్ షేరు ఏడుశాతం నష్టపోయి రూ.2,208 వద్ద స్థిరపడింది. ఐటీ శాఖ రూ.1,000 కోట్ల బోగస్ ఖర్చులు గుర్తించిందంటూ వస్తున్న వార్తలపై బీఎస్‌ఈ ఎక్సే్చంజీ స్పష్టత కోరడంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి కారణమైంది.
►రుచి సోయా షేరుకు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్‌ఈలో ఈ షేరు 16% లాభపడి రూ.945 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో 20 శాతం మేర బలపడి రూ.978 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) ప్రక్రియ నేపథ్యంలో గడచిన నాలుగు రోజుల్లో ఈ షేరు 11 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.
►ఇండెక్సుల్లో రెండో అతిపెద్ద వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ షేరు మూడు శాతం లాభపడి రూ.2,337 వద్ద స్థిరపడింది. ఇటీవల అమ్మకాల ఒత్తిడికిలోనైన ఈ షేరుకు కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment