కొద్ది రోజులుగా గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీ స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి తదుపరి ధరలు ఊపందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు బలపడుతున్నాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన లిక్విడిటీ విధానాలకు తెరతీయడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో దేశీయంగానూ పలు స్టాక్స్ బేర్‌మంటున్నాయి. 2021 అక్టోబర్‌లో చరిత్రాత్మక గరిష్టాలను తాకిన స్టాక్ మార్కెట్లు డీలా పడటంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు నేలచూపులకు పరిమితమవుతున్నాయి. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు చిల్లు పడుతోంది.
రికార్డ్ స్థాయి నుంచి..
గతేడాది అక్టోబర్‌లో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 62,245 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో బిలియన్ డాలర్ల(అప్పట్లో సుమారు రూ. 7,500 కోట్లు) మార్కెట్ విలువను అందుకున్న కంపెనీలు 400కుపైగా నమోదయ్యాయి. అయితే తదుపరి ద్రవ్యోల్బణం ధాటికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా, ఆర్‌బీఐవరకూ వడ్డీ రేట్ల పెంపు బాటను పట్టడంతో ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. దీనికితోడు రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం ముడిచమురు ధరలకు రెక్కలిచ్చింది. ఫలితంగా డాలరు భారీగా బలపడితే.. రూపాయి పతన బాట పట్టింది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో నిరవధిక అమ్మకాలు చేపడుతుండటంతో మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 53,235 పాయింట్ల స్థాయికి తిరోగమించింది. దీంతో లిస్టెడ్ కంపెనీల విలువలూ నీరసించాయి. గత 9 నెలల్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో 660 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52 లక్షల కోట్లు) ఆవిరైందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు! ప్రస్తుతం బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,45,23,834 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మధ్య, చిన్నతరహా కంపెనీలకు అమ్మకాల సెగ తగులుతోంది!!
విలువల నేలచూపు
మార్కెట్లతోపాటు ఇటీవల షేర్ల ధరలు సైతం కుదేలవుతున్నాయి. ఇది చాలదన్నట్లు మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 79కు చేరింది. ఫలితంగా బిలియన్ డాలర్ల(రూ. 7,900 కోట్లు) జాబితాకు రెండు వైపులా దెబ్బతగులుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. షేర్ల ధరలు తగ్గడానికితోడు రూపాయి విలువ నీరసించడంతో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ జాబితాలో కంపెనీల సంఖ్య క్షీణించింది. దీంతో వీటి సంఖ్య తాజాగా సుమారు 340కు చేరింది.
జాబితాలో వీక్
గత 9 నెలల్లో కొన్ని కంపెనీల షేర్లు పతన బాటలో సాగాయి. దీంతో వీటి విలువకు భారీగా చిల్లు పడింది. ఈ జాబితాలో మణప్పురం ఫైనాన్స్, వెల్‌స్పన్ ఇండియా, హెచ్‌ఈజీ, నజారా టెక్నాలజీస్, జెన్సార్, లక్స్ ఇండస్ట్రీస్, ఆర్‌బీఎల్ బ్యాంక్, దిలీప్ బిల్డ్‌కాన్ 70–50 శాతం మధ్య కుప్పకూలాయి. ఈ బాటలో లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, మెట్రోపోలిస్ హెల్త్‌కేర్, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, ఇండిగో పెయింట్స్, వైభవ్ గ్లోబల్, ఇండియాబుల్స్ హౌసింగ్ తదితరాలు సైతం అత్యధికంగా క్షీణించాయి. ఇవన్నీ బిలియన్ డాలర్ విలువను కోల్పోవడం గమనార్హం! ఈ కాలంలో బీఎస్‌ఈలోని 1,100 షేర్లను పరిగణిస్తే 75 శాతంవరకూ నష్టాల బాటలోనే సాగాయి!
లాభపడ్డవీ ఉన్నాయ్
కొద్ది రోజులుగా మార్కెట్లు డీలా పడినప్పటికీ జోరందుకున్న కంపెనీలూ ఉన్నాయి. దీంతో ఇదే కాలంలో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న జాబితాలో ఆటో, ఇండస్ట్రియల్ విడిభాగాల కంపెనీ ఎల్జీ ఎక్విప్‌మెంట్స్‌తోపాటు, శ్రీ రేణుకా షుగర్స్, జీఎన్‌ఎఫ్‌సీ, ఈజీ ట్రిప్ ప్లానర్స్, సుందరం క్లేటాన్, ఆర్‌హెచ్‌ఐ మెగ్నీసిటా, బోరోసిల్ రెనెవబుల్స్ చోటు సాధించాయి. ఈ షేర్లు 20–70 శాతం మధ్య జంప్‌చేయడం ఇందుకు సహకరించింది.
Comments
Please login to add a commentAdd a comment