ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి వాటిని హోమ్ డెలివరీ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్వహించడానికి యోచిస్తున్నారు. మద్యం డెలివరీలను అనుమతించడం వల్ల లాభనష్టాలను అధికారులు అంచనా వేస్తున్నట్లు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.
ఇప్పటికే మద్యం హోమ్ డెలివరీ విధానం ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది. 2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం హోమ్ డెలివరీ చేయడానికి అనుమతించాయి. ఆ తరువాత ప్రస్తుతం ఈ విధానంలో మద్యం డెలివరీ చేస్తున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అమ్మకాలు 20 నుంచి 30 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో వంద శాతం మంది హైదరాబాద్ వాసులు మద్యం హోమ్ డెలివరీ విధానాలకు సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. అయితే ఇది ఎప్పుడు అమలులోకి వస్తుంది అనే విషయానికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
మద్యం హోమ్ డెలివరీ అనేది పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి, పెద్ద నగరాల్లో మితమైన మద్యం అందించడానికి ఉపయోగపడుతుంది. మహిళలు, సీనియర్ సిటిజన్‌లు మద్యం కోసం షాప్ ముందు నిలబడాల్సిన అవసరం ఉండదని ఓ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. అయితే మద్యం హోమ్ డెలివరీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన ఉందని పలువురు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment